న్యూఢిల్లీ: సన్నీ డియోల్ నటించిన బాలీవుడ్ చిత్రం జాట్(Jaat Movie) వివాదంలో ఇరుక్కున్నది. ఆ ఫిల్మ్‌లో నటించిన సన్నీ డియోల్‌తో పాటు రణ్‌దీప్ హూడా, వినీత్ కుమార్ సింగ్‌పై కేసు రిజిస్టర్ చేశారు. ఆ ఫిల్మ్‌లోని ఓ సీన్లో మతపరమైన మనోభావాలను దెబ్బతీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. జలంధర్ పోలీసులు ఆ కేసు ఫైల్ చేశారు. జాట్ డైరెక్టర్ గోపిచంద్ మలినేనితో పాటు నిర్మాతలపైన కూడా కేసు పెట్టారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 299 ప్రకారం కేసు పెట్టినట్లు తెలుస్తోంది.
ఏప్రిల్ 10వ తేదీన జాట్ చిత్రం రిలీజైంది. ఆ ఫిల్మ్‌లో క్రైస్తవ మనోభావాలు దెబ్బతీసే రీతిలో ఓ సీన్ ఉన్నట్లు ఫిర్యాదు నమోదు అయ్యింది. యేసు క్రీస్తును అగౌరవపరుస్తున్న రీతిలో సీన్ ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలు ఉన్న ఈ పవిత్ర మాసంలో కావాలనే ఆ సినిమాను రిలీజ్ చేశారని, క్రైస్తవుల్లో ఆగ్రహాన్ని తెప్పించి, దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని, అందుకే డైరెక్టర్, నిర్మాత, రచయితపై కేసు పెట్టినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు.