మహేష్‌బాబు కథానాయకుడిగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అతడు, ఖలేజా వంటి హిట్ చిత్రాల తర్వాత వీరి కాంబినేషన్లో వస్తున్న ఈ హ్యాట్రిక్ మూవీపై అభిమానులు భారీ అంచనాల్ని పెట్టుకున్నారు. ఇందులో పూజా హెగ్డే, శ్రీలీల కథానాయికలుగా నటిస్తున్నారు. ఇప్పటికే కొంతభాగం చిత్రీకరణ పూర్తయింది. త్వరలో కొత్త షెడ్యూల్ మొదలుకానుంది. ఈ సినిమా టైటిల్ గురించి ఆసక్తికరమైన చర్చ జరుగుతున్నది.
గత కొద్దికాలంగా అనేక టైటిల్స్ ప్రచారంలోకి వచ్చాయి. అయితే ‘అమరావతికి అటు ఇటు’ అనే టైటిల్ ప్రముఖంగా వినిపిస్తున్నది. తాజా సమాచారం ప్రకారం అదే టైటిల్‌ను ఖరారు చేసే ఆలోచనలో చిత్రబృందం ఉందని తెలిసింది. ఈ చిత్ర టీజర్‌తో పాటు టైటిల్‌ను దివంగత నటుడు సూపర్‌స్టార్ కృష్ణ జన్మదినమైన మే 31న ప్రకటిస్తారని అంటున్నారు. అయితే టైటిల్ విషయంలో చివరి నిమిషంలో కూడా మార్పులు జరగొచ్చని, చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడితేనే స్పష్టత వస్తుందంటున్నారు. సంక్రాంతి కానుకగా ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.