సాంఘిక కథాంశాలకు భక్తిరస, ఐతిహాసిక అంశాలను జోడించి సినిమాలను రూపొందించే ట్రెండ్ ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఇప్పుడున్న సాంకేతికతను అందిపుచ్చుకొని వెండితెరపై ఓ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరిస్తున్న ఈ తరహా చిత్రాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. కార్తికేయ-2, హనుమాన్, కాంతార, కల్కి వంటి చిత్రాలు సాధించిన అద్భుత విజయాల స్ఫూర్తితో సోషియో ఫాంటసీ డివోషనల్ జానర్ చిత్రాల నిర్మాణం మరింతగా ఊపందుకుంది. ప్రస్తుతం తెలుగులో పదుల సంఖ్యలో ఈ తరహా చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి. బాక్సాఫీస్ దగ్గర కాసుల వర్షం కురుస్తుండటంతో సోషల్ ఫిల్మ్స్ విత్ డివోషనల్ ఎలిమెంట్స్ జానర్ ఇప్పుడు టాలీవుడ్ ట్రెండ్ అవుతున్నది.
Tollywood | శ్రీకృష్ణుడి చరిత్ర, ద్వారక నేపథ్యంలో రూపొందించిన ‘కార్తికేయ-2’, దక్షిణ కన్నడ ప్రజల భూతకోల ఆరాధన కథాంశంతో వచ్చిన ‘కాంతార’, హనుమంతుడి మహిమల నేపథ్యంలో తెరకెక్కిన ‘హనుమాన్’ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలను సాధించాయి. దేవుడి కాన్సెప్ట్ చుట్టూ అల్లుకున్న ఈ కథలు ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాయి. కాంతార, హనుమాన్ చిత్రాలు పాన్ ఇండియా స్థాయిలో రూ.300 కోట్లకుపైగా వసూళ్లు సాధించడానికి ఆ చిత్రాల్లోని భక్తి కోణమే కారణం. ప్రస్తుతం ఈ మూడు చిత్రాలకు సీక్వెల్స్ సన్నాహాలు జరుగుతున్నాయి. ‘కాంతార’ ముందు జరిగిన కథతో ‘కాంతార చాప్టర్ 1’ పేరుతో ప్రీక్వెల్‌ను తెరకెక్కిస్తున్నారు. కొద్దిమాసాల క్రితం విడుదల చేసిన ఫస్ట్‌లుక్ టీజర్ దేశవ్యాప్తంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ డివోషనల్ థ్రిల్లర్‌ను భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నారు. దక్షిణాది నాలుగు భాషలు, హిందీతోపాటు బెంగాలీ, ఇంగ్లీష్ భాషల్లో కూడా ఈ ప్రీక్వెల్‌ను విడుదల చేస్తామని చిత్ర హీరో, దర్శకుడు రిషబ్‌శెట్టి తెలిపారు.
ఇక ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ ప్రకటించారు దర్శకుడు ప్రశాంత్‌వర్మ. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా కథ మొత్తం హనుమాన్ పాత్ర చుట్టే నడుస్తుందట. ఓ అగ్ర హీరో హనుమాన్ పాత్రను పోషిస్తారని ప్రచారం జరుగుతున్నది. హనుమాన్ పాత్ర కోసం చిరంజీవి, రామ్‌చరణ్‌కే తమ తొలి ప్రాధాన్యం అని ఇటీవల చిత్ర నిర్మాత పేర్కొనడంతో ‘జై హనుమాన్’ అందరిలో ఉత్సుకతను పెంచుతున్నది. ‘కార్తికేయ-3’ చిత్రానికి కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. ‘కార్తికేయ-2’లో కృష్ణతత్వాన్ని నేపథ్యంగా తీసుకున్న దర్శకుడు చందు మొండేటి మూడో భాగంలో మరో భక్తి కోణాన్ని ఎంచుకోనున్నారని తెలుస్తున్నది.
ఇటీవల విడుదలైన ప్రభాస్ ‘కల్కి’ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో అపూర్వ ఆదరణ సొంతం చేసుకుంది. శనివారంతో ఈ సినిమా వెయ్యికోట్ల క్లబ్‌లోకి చేరింది. తెలుగు తెరపై పౌరాణిక, ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ అంశాలతో వచ్చిన తొలి చిత్రం ‘కల్కి’ కావడం విశేషం. మూడు భిన్న ప్రపంచాల నేపథ్యంలో మహాభారత కథను అనుసంధానం చేసిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నది. ఇప్పటికే సీక్వెల్ కొంత భాగం షూటింగ్ పూర్తయింది. కర్ణుడు, అశ్వత్థామ ప్రధాన పాత్రధారులుగా సీక్వెల్ ఉండబోతున్నది. కథానుగుణంగా ‘కల్కి’ పాత్రను రెండో భాగం పతాక ఘట్టాల్లో పరిచయం చేస్తారని సమాచారం. మూడోభాగం మొత్తం ‘కల్కి’ పాత్రధారి చుట్టూ కథ నడుస్తుందని చెబుతున్నారు. వచ్చే ఏడాది ద్వితీయార్ధంలో ‘కల్కి-2’ ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది.

‘పేపర్‌బాయ్’ ఫేమ్ జయశంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అరి’ చిత్రంలో కూడా డివోషనల్ ఎలిమెంట్ ఉంటుందని చెబుతున్నారు. అరిషడ్వర్గాల కాన్సెప్ట్ ఆధారంగా సైకలాజికల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా రూపొందిస్తున్న ఈ చిత్రంలో శ్రీకృష్ణుడి పాత్ర నేపథ్యంలో కొన్ని సన్నివేశాలు ఉంటాయని సమాచారం. సుమంత్ హీరోగా రానున్న ‘మహేంద్రగిరి వారాహి’ చిత్రాన్ని కూడా భక్తి అంశాలతో తెరకెక్కిస్తున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ తిరిగే కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామని దర్శకుడు తెలిపారు. ఈ సినిమాలో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం కీలక పాత్రలో నటిస్తున్నారు.
నిఖిల్ కథానాయకుడిగా భరత్ కృష్ణమాచారి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయం భూ’లో సైతం డివోషనల్ అంశాలు ఉంటాయని తెలుస్తున్నది. ఇందులో హీరో నిఖిల్ లెజెండరీ వారియర్ పాత్రలో కనిపించనున్నారు. కథానుసారం ఆయన ఆంజనేయ భక్తుడిగా కనిపిస్తాడని, ఆయన ఆరాధన ద్వారానే ప్రత్యేక శక్తులను పొంది శత్రువధ చేస్తాడని చెబుతున్నారు. మంచు విష్ణు టైటిల్ రోల్ పోషిస్తున్న ‘కన్నప్ప’ చిత్రం చారిత్రక భక్తి రసాత్మక కథాంశంతో రూపొందిస్తున్నారు. ప్రబంధ కవి ధూర్జటి రాసిన ‘శ్రీకాళహస్త్తీశ్వర మాహాత్మ్యం’ ఆధారంగా ఈ చిత్రానికి రూపకల్పన చేస్తున్నారు.
ఇందులో కన్నప్ప పాత్రలో మంచు విష్ణు నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. ఈ పాన్ ఇండియా చిత్రంలో మోహన్‌లాల్, మోహన్‌బాబు, శివరాజ్‌కుమార్, అక్షయ్‌కుమార్, ప్రభాస్ వంటి అగ్ర తారాగణం భాగం కావడం విశేషం. ప్రేక్షకులను భక్తిరస ప్రపంచంలో ఓలలాడించే చిత్రమిదని, సాంకేతికంగా అత్యున్నత ప్రమాణాలతో తెరకెక్కించామని మంచు విష్ణు తెలిపారు.
డివోషనల్ టచ్ ఉన్న కథాంశాలు బాక్సాఫీస్ వద్ద హిట్ ఫార్ములాగా మారడంతో ఔత్సాహిక దర్శకులు కూడా ఈ తరహా కాన్సెప్ట్స్ పట్ల మక్కువ చూపుతున్నారు. భవిష్యత్తులో సాంఘిక, భక్తిరస, ఆధ్యాత్మిక అంశాలు కలబోసిన కథాంశాలతో మరిన్ని చిత్రాలు వచ్చే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఇలా తెలుగు సినిమా భక్తిపథంలో సాంఘిక కథలను అసాధారణంగా నిర్మిస్తూ.. ప్రేక్షకుల మనసులు గెలుచుకుంటున్నది.
– సినిమా డెస్క్