సీనియర్ సినీ రచయిత నడిమింటి నరసింగరావు (72) బుధవారం హైదరాబాద్‌లో కన్నుమూశారు. గతకొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. కృష్ణవంశీ దర్శకత్వం వహించిన ‘గులాబీ’, రామ్‌గోపాల్‌వర్మ డైరెక్ట్ చేసిన ‘అనగనగా ఒకరోజు’ చిత్రాలతో పాటు పలు విజయవంతమైన చిత్రాలకు ఆయన మాటలు రాశారు. సినిమాల్లోకి రాకముందు ఆయన ‘బొమ్మలాట’ అనే నాటకం ద్వారా మంచి గుర్తింపును పొందారు.
అనంతరం పాతబస్తీ, ఊరికి మొనగాడు, కుచ్చి కుచ్చి కూనమ్మా వంటి సినిమాలకు మాటల రచయితగా పనిచేశారు. దూరదర్శన్‌లో ప్రసారం అయిన ‘తెనాలి రామకృష్ణ’ సీరియల్‌తో పాటు ఈటీవీలో పాపులర్ అయిన వండర్బోయ్, లేడీ డిటెక్టివ్, అంతరంగాలు సీరియల్స్‌కు నరసింగరావు మాటలు అందించారు. ఆయన మృతిపట్ల పలువురు సినీ ప్రముఖులు సంతాపాన్ని తెలియజేశారు.