గురువారం హైదరాబాద్ కార్యాలయంలో సమావేశమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ కామర్స్ (టీఎఫ్‌సీసీ) పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. ఇక నుంచి ప్రతి ఏడాది ఉత్తమ ప్రతిభ కనబరచిన నటీనటులు, సాంకేతిక నిపుణులకు వివిధ విభాగాల కింద సినిమా అవార్డులను ప్రదానం చేయాలని నిర్ణయించింది. తెలుగు సినిమా పుట్టిన రోజుని పురస్కరించుకొని ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 6న ఈ అవార్డులను ప్రదానం చేస్తారు. అదే రోజున నటులు తమ ఇళ్లపై, థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండాలను ఆవిష్కరించాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ప్రముఖ రచయిత, నటుడు పరుచూరి గోపాలకృష్ణ అధ్యక్షతన ఈ సమావేశాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఛాంబర్ అధ్యక్షుడు దామోదరప్రసాద్ మాట్లాడుతూ ‘ఫిబ్రవరి 6న సినిమా దినోత్సవాన్ని గతంలో కొన్ని సంస్థలు చేశాయి. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ తరపున తొలిసారి చేయబోతున్నాం. వచ్చే ఏడాది నుంచి ఈ వేడుకను ఘనంగా నిర్వహిస్తాం. అలాగే పాతతరం కళాకారులను సన్మానిస్తాం’ అన్నారు. ఛాంబర్ కార్యదర్శి ప్రసన్నకుమార్ మాట్లాడుతూ ‘తెలుగు తొలిటాకీ ఫిల్మ్ ‘భక్త ప్రహ్లాద’ ఫిబ్రవరి 6న విడుదలైంది. ఈ రోజు సినిమా పుట్టిన రోజు. తెలుగు సినిమా గొప్పదనాన్ని చాటేలా సినిమా దినోత్సవ వేడుకను నిర్వస్తాం’ అన్నారు. ఇండస్ట్రీలోని అన్ని విభాగాల వాళ్లు సమన్వయం చేసుకొని ఈ వేడుకను నిర్వహించాలని నటుడు, నిర్మాత మురళీమోహన్ సూచించారు.