కర్నూలు సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో బస్సు దగ్ధమై 19 మంది ప్రయాణికులు అగ్నికీలలకు ఆహూతి అయిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుగు రాష్ర్టాలను దిగ్భ్రాంతికి గురి చేసింది. గత రెండు రోజులుగా మీడియా, సోషల్ మీడియా అంతటా ఈ దుర్ఘటనకు సంబంధించిన కథనాలు, హృదయ విదారక దృశ్యాలే దర్శనమిస్తున్నాయి. బస్సుల భద్రతా నిబంధనలు, రక్షణా సంస్కరణల ఆవశ్యకతను అందరూ చర్చించేలా చేసిన సంఘటన ఇది.
ఈ ప్రమాదంలో మృతి చెందిన వారికి పలువురు సినీ ప్రముఖులు సోషల్మీడియా వేదికగా సంతాపం తెలిపారు. ప్రముఖ నటి రష్మిక మందన్నా ఈ విషాదంపై తీవ్ర విషాదం వ్యక్తం చేస్తూ తన ఇన్స్టాగ్రామ్లో ఓ స్టోరీని పోస్ట్ చేశారు. ‘కర్నూలులో జరిగిన ఈ విషాదం నా హృదయాన్ని ముక్కలు చేసింది. ఆ మండుతున్న బస్సు లోపల ఆ ప్రయాణికులు ఎంత బాధ అనుభవించారో తలచుకుంటే గుండె బరువెక్కిపోతున్నది. చిన్న చిన్న పిల్లలతో సహా ఎంతో మంది నిమిషాల్లో ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంతో ప్రాణాలు పోగొట్టుకున్న వారి కుటుంబాల బాధ తీర్చిలేనిది.
మృతుల ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుడ్ని ప్రార్థిస్తాను.’ అని పోస్ట్ చేశారు రష్మిక. నటుడు, మూవీ ఆర్టిస్ట్ అసోషియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు సైతం తన ఎక్స్ ఖాతాలో ఈ విషాదంపై స్పందించారు. ఈ విషాదం తనను ఎంతగానో బాధపెట్టిందని, బాధిత కుటుంబాలకు హృదయపూర్వక సానుభూతి తెలియజేస్తున్నానని మంచు విష్ణు తన ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. ఇక నటుడు సోనూసూద్ ఈ విషాదంపై తన ఎక్స్ ఖాతాలో ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలను అరికట్టడానికి కఠినమైన భద్రతా నిబంధనలు అవసరమని, సురక్షితమైన వైరింగ్, అత్యవసర నిష్క్రమణలు బస్సుల్లో అందుబాటులో ఉంచాలని ఆయన అభిప్రాయపడ్డారు.