దేశ సరిహద్దుల్లో క్షిపణుల శబ్దాలు హోరెత్తుతున్నాయి. శత్రుసైనికుల గుండెలు భయంతో ఠారెత్తుతున్నాయి. భారత జవాన్ల వీరోచిత పోరాట పటిమకు ఆసేతుహిమాచలం ప్రశంసలు మిన్నంటుతున్నాయి. దాయాదుల దాష్టికానికి బుల్లెట్లతోనే సక్రమమైన సమాధానమిస్తున్న భారత సైన్య పరాక్రమానికి వందకోట్ల భారతీయులు జేజేలు పలుకుతున్నారు. జై జవాన్ అంటూ నినదిస్తున్నారు. మరింత ధైర్యంగా ముందుకు సాగండి.. మీ వెంట మేమున్నామంటూ పోస్టులు పెడుతూ ఉత్తేజపరుస్తున్నారు. భారత సైనికులకు సెల్యూట్ చేస్తున్నారు. సినిమా సెలబ్రిటీలు సైతం మేమున్నామంటూ సోషల్ మీడియా ద్వారా భారత సైన్యానికి సంఘీభావం ప్రకటిస్తున్నారు.
ఆపరేషన్ సిందూర్’లో భారత సైన్యం ప్రదర్శిస్తున్న శౌర్యపరాక్రమాలను అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కొనియాడారు. యుద్ధ సమాచారాన్ని పంచుకునే విషయంలో ప్రజలందరూ బాధ్యతతో వ్యవహరించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన ఎక్స్ (ట్విట్టర్)లో ఓ పోస్ట్ పెట్టారు. ‘ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అలుపులేని పోరాటం చేస్తున్న సైనికులకు వందనాలు. సైనికుల ధైర్యసాహసాలతో స్ఫూర్తిపొందుతూ మనమంతా ఐక్యతను ప్రదర్శించాలి. శాంతి, సామరస్యంతో కూడిన భవిష్యత్తు కోసం కలిసి నిలబడదాం. భారత సైన్యం కదలికలను మీరు చూసినట్లయితే వాటిని ఫోటోలు, వీడియోలుగా తీయొద్దు. అలా చేస్తే శత్రువుకి సహాయం చేసినట్లే. ధృవీకరించబడని వార్తలను సోషల్‌మీడియాలో షేర్ చేయకండి. దానివల్ల శత్రువుకు ఉప్పందించినవాళ్లమవుతాం. ప్రశాంతంగా, అప్రమత్తంగా ఉండండి. విజయం మనదే.
-రాజమౌళి
‘ఈ సమయంలో దేశాన్ని రక్షిస్తున్న సాయుధ దళాలకు ఎల్లప్పుడు రుణపడి ఉండాలి. మీరు నిజమైన హీరోలు. దేశం కోసం మీరూ, మీ కుటుంబం చేస్తున్న త్యాగాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. జై హింద్’ అంటూ బాలీవుడ్ అగ్ర కథానాయిక అనుష్కశర్మ తన ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. అనుష్కశర్మ మిలటరీ కుటుంబం నుంచి వచ్చింది. ఆమె తండ్రి అజయ్ కుమార్ శర్మ ఆర్మీలో ఉన్నత స్థాయి అధికారిగా పనిచేశారు. దేశ రక్షణ, సమగ్రతకు సంబంధించిన పలు విషయాల్లో గురించి సోషల్‌మీడియా ద్వారా తన భావాల్ని పంచుకుంటుంది అనుష్క శర్మ.
– అనుష్క శర్మ
ఆపరేషన్ సిందూర్’ రూపంలో దేశం తనకు జరిగిన అన్యాయానికి బదులు తీర్చుకుంటున్నదని అగ్ర కథానాయిక రష్మిక మందన్న వ్యాఖ్యానించింది. శాంతిని కోరుకోవడం అంటే జరిగిన నష్టాన్ని మౌనంగా అంగీకరించడం కాదని, అన్యాయానికి ప్రతీకారం తీర్చుకుంటున్న దేశాన్ని ఎవరూ ప్రశ్నించొద్దని కోరింది. ‘ఉగ్రవాదం నుంచి దేశాన్ని రక్షించేందుకు చేస్తున్న పోరాటం యుద్ధం కాదు. దీనికి మద్దతు ఇచ్చేవారిని యుద్ధాన్ని కాంక్షించే వారిగా చూడొద్దు. దేశ భద్రత, సమగ్రత కోసం తపించే పౌరులు వారు. అత్యవసర ఆత్మరక్షణ నైతికంగా సరైనదే. ఉగ్రచర్యకు ప్రతీకారం తీర్చుకోవడాన్ని బాధ్యతగానే భావించాలి. సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న వారిని ప్రశ్నించండి.
– రష్మిక మందన్న
గురువారం అర్ధరాత్రి దేశమంతా నిద్రపోతున్న సమయంలో మన సైన్యం 15 భారత నగరాలను పాకిస్థాన్ దాడుల నుంచి రక్షించింది. హ్యాట్సాఫ్ ఇండియన్ ఆర్మీ. ఈ రోజు మేమంతా ప్రశాంతంగా ఊపిరి పీల్చుకుంటున్నామంటే అందుకు మీరే కారణం. శ్వాస ఉన్నంత వరకు మిమ్మల్ని గౌరవిస్తూనే ఉంటాం. మీరు ఈ పోరులో విజయులై క్షేమంగా తిరిగి రావాలని కోరుకుంటున్నా.
-కాజల్ అగర్వాల్
పెహల్గాం దాడి జరిగిన నేపథ్యంలో నా సోదరుని నుంచి నాకు ఫోన్ వచ్చింది. అప్పుడు తను అక్కడే ఉన్నాడు. ‘భయ్యా.. మనది దైవభూమి. దైవం మన వెనకే ఉన్నాడు. ఆ వైష్ణోమాతే మనల్ని కాపాడుతుంది. మన రక్షణసైన్యమే మనకు శ్రీరామరక్ష. పాక్‌కు సంబంధించిన ఒక్క క్షిపణి కూడా మన భూమిని తాకలేదు.. తాకనివ్వరు. భారత్ మాతాకీ జై..’ అన్నాడు. ఆ క్షణంలో నా తమ్ముడి మాటలు నా మనసుని గాఢంగా తాకాయి. ప్రతి భారతీయుడికీ దేశంపై మమకారం.. దైవంపై భక్తి అవసరం. తప్పకుండా ఈ యుద్ధంలో విజయం మనదే.
– అనుపమ్ ఖేర్
శత్రువుల లక్ష్యం జమ్మూగా తెలుస్తున్నది. జమ్మూను లక్ష్యంగా చేసుకొని వారు పోరాటం సాగించనున్నట్టు సమాచారం. ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలి. సైన్యం అప్రమత్తతతో మెలగాలి. ఎప్పటికైనా పీవోకే మనదే. తుపాకీ గుళ్లకు ఎదురెళ్లి పోరాడుతున్న మన సైన్యం ధైర్య సాహసాలకు జోహార్లు.. జై భారత్.. భారత్ మాతాకీ జై..
– కంగనా రనౌత్
మన సాయుధ దళాల రక్షణకై నేనెప్పుడూ దైవాన్ని ప్రార్థిస్తూనే ఉంటాను. దేశం కోసం ప్రాణాలను సైతం పణంగా పెడుతున్న సైనికుల త్యాగాలకు విలువ కట్టలేం. ఈ యుద్ధంలో విజయం మనదే. వాళ్లు ప్రారంభించారు.. మనం ముగిస్తాం.
-మంచు విష్ణు
శత్రు మూకల గుండెల్లో భయాన్నీ నింపేలా మన సైన్యం దూసుకుపోతున్నది. భారత సైన్యానికి దైవం మరింత శక్తినివ్వాలి. మనదేశం కనీవినీ ఎరుగని విజయాన్ని నమోదు చేయబోతున్నది.
– సాయి దుర్గ తేజ్
మమ్మల్నందర్నీ కాపాడుతున్న మీకు కృతజ్ఞతలు. మీరు సురక్షితంగా ఉండండి. మీరు జాగ్రత్తగా ఉంటేనే మాకు రక్షణ. భారత్‌మాతాకీ జై..
– బాలీవుడ్ నటుడు వీర్ దాస్
ఈ యుద్ధంలో మన త్రివిధ దళాలు అసమాన పోరాట పటిమను ప్రదర్శిస్తున్నాయి. మన మాతృభూమిని, దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడటానికి నిరంతర పోరాటం చేస్తున్నాయి. కులమతాలకు అతీతంగా దేశం మొత్తం ఒక్కతాటిపై నిలిచాం. ఇక హింసను భారతావని ఏ మాత్రం ఉపేక్షించదని, అందుకు మూల్యం చెల్లించాల్సిందేననే బలమైన సందేశాన్ని మన సైన్యం శత్రువులకు అందిస్తున్నది
– జాన్వీకపూర్