తిరుమల: సినీ,టీవీ నటి రాశి (Actress Raasi) కుటుంబ సభ్యులతో కలసి గురువారం తిరుమలలోని (Tirumala) శ్రీవారిని దర్శించుకున్నారు. ఉదయం విఐపీ విరామ సమయంలో భర్త, ప్రముఖ దర్శకుడు శ్రీ మునితో కలిసి ఆలయానికి చేరుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులతో కలసి స్వామి వారి సేవలో పాల్గొన్నారు .
దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు దంపతులకు వేదశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు తీర్థప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. ఏపీలోని పశ్చిమ గోదావరి(West Godavari) జిల్లా ప్రాంతానికి చెందిన రాశి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది. కొన్ని హిందీ సినిమాల్లోనూ, తెలుగు టీవీ సీరియల్లోనూ ఆమె నటించింది.
1989 లో వచ్చిన ‘మమతల కోవెల’ సినిమాలో బాల నటిగా చిత్రసీమలో అడుగు పెట్టిన రాశి 1997 లో జగపతి బాబు ‘శుభాకాంక్షలు’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత గోకులంలో సీత, పెళ్లి పందిరి, సుప్రభాతం, గిల్లి కజ్జాలు, స్నేహితులు తదితర హిట్ సినిమాల్లో కథానాయికగా నటించింది.