జీవితంలోని ప్రతిక్షణాన్ని ప్రేమించాలని, ప్రతి అనుభూతిని మనసారా ఆస్వాదించాలని కోరింది అగ్ర కథానాయిక అనుష్క. జీవితం, స్నేహం, ప్రేమ అంశాల్ని స్పృశిస్తూ అనుష్క తాత్విక ధోరణిలో ఇన్స్టాగ్రామ్లో చేసిన పోస్ట్ ఆమె అంతరంగాన్ని ఆవిష్కరించేలా సాగింది. విఫలబంధంలో కూడా సౌందర్యాన్ని తరచిచూడాలని…బాధను అధిగమించి సరికొత్త ఆరంభంతో జీవితంలో ముందుకుసాగాలని అనుష్క ఆకాంక్షించింది. ‘ఈ ప్రపంచంలో మంచికి ప్రతీకలా జీవితాన్ని గడపాలి. స్నేహాన్ని ప్రేమించండి…ముక్కలైన హృదయాలకు సాంత్వన చేకూర్చేలా అనురాగాన్ని వర్షించాలి. మన ఆనందాల్ని పంచుకునే, కన్నీళ్లను తుడిచే మిత్రులతో కలకాలం అనుబంధాన్ని కొనసాగించండి. ఈ లోకం అందాల్ని చూస్తూ బ్రతుకుతున్నందుకు జీవితంపై సదా కృతజ్ఞత చూపించాలి. ఈ ప్రపంచంలో ప్రతిరోజు ఎన్నో అందమైన విషయాలు విలుప్తమైపోతున్నాయి.. అందులో నీ హృదయాన్ని కలిపే ప్రయత్నం మాత్రం చేయకు’ అంటూ అనుష్క ఎమోషనల్గా వ్యాఖ్యానించింది. తాత్విక భావనలు కలబోసిన అనుష్క మాటలు హృదయాన్ని తడిమేలా ఉన్నాయంటూ నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.