న్యూఢిల్లీ: గత నాలుగేళ్లలో 111 మంది సిట్టింగ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ రాజకీయ పార్టీలు మారారు. వీరిలో 26 మంది లోక్‌సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 78 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. (MPs, MLAs switched parties) ఈ 111 మందిలో 29 మంది అంటే 26 శాతం మంది ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరారు. పార్టీ మారిన ప్రజాప్రతినిధులను చేర్చుకోవడంలో ఆ పార్టీ రెండవ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అత్యధికంగా 32 మంది ప్రజాప్రతినిధులు నాగా పీపుల్స్ ఫ్రంట్ (ఎన్పీఎఫ్)లో చేరారు. ఇది మొత్తం సంఖ్యలో 29 శాతం ఉన్నది. అయితే, ఎమ్మెల్యేలు పార్టీ మారడం వల్ల కాకుండా 2025లో పార్టీ విలీనం వల్ల ఇది జరిగింది. ముఖ్యమంత్రి నెయిఫియు రియో నేతృత్వంలోని నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రోగ్రెసివ్ పార్టీ (ఎన్డీపీపీ)కి చెందిన 32 మంది ఎమ్మెల్యేలు, కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్న ఎన్ఫీఎఫ్లో విలీనమ్యారు. ఈ విలీనం తర్వాత ఎన్పీఎఫ్ శాసనసభాపక్ష నాయకుడిగా సీఎం రియో ఎన్నికయ్యారు.
కాగా, అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్), నేషనల్ ఎలక్షన్ వాచ్ నిర్వహించిన తాజా విశ్లేషణ ప్రకారం ఈ వివరాలు వెల్లడయ్యాయి. 2022-2026 మధ్య జరిగిన సాధారణ ఎన్నికలు, ఉప ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని ఈ అధ్యయనం జరిపాయి. సెప్టెంబర్ 24న విడుదలైన ఈ నివేదిక ప్రకారం, 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో పార్టీ మార్పులు జరిగాయి. అత్యధికంగా నాగాలాండ్‌లో 32 మంది ప్రజా ప్రతినిధులు పార్టీ మారారు. ఆ తర్వాతి స్థానాల్లో పశ్చిమ బెంగాల్ (20 మంది), తెలంగాణ (తొమ్మిది మంది), గోవా, పంజాబ్‌లో ఎనిమిది మంది చొప్పున ప్రజా ప్రతినిధులు పార్టీలు మారారు.
అయితే ఈ 111 మంది ప్రజా ప్రతినిధుల కేసులు కేవలం సాధారణ పార్టీ ఫిరాయింపులు మాత్రమే కావు. పార్టీ విలీనాలు, ఉప ఎన్నికల్లో గెలిచే ముందు రాజీనామా చేసి పార్టీ మారిన ప్రజాప్రతినిధులు, అలాగే అనర్హతకు గురై ఆ తర్వాత మరో పార్టీ టికెట్‌పై గెలిచిన వారిని కూడా ఏడీఆర్ పరిగణనలోకి తీసుకున్నది.
మరోవైపు ఏడీఆర్ జాబితా ప్రకారం బీజేపీలో చేరిన 29 మంది చట్టసభ సభ్యులలో, ఏడుగురు రాజ్యసభ ఎంపీలు, 22 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నుంచి ఎన్నికైన ఏడుగురు రాజ్యసభ సభ్యులైన స్వాతి మాలివాల్, అశోక్ మిట్టల్, హర్భజన్ సింగ్, రాఘవ్ చద్దా, సందీప్ కుమార్ పాఠక్, విక్రమ్‌జిత్ సింగ్ సాహ్నీ, రాజిందర్ గుప్తా ఆ తర్వాత బీజేపీలో చేరారు.

29 Joined Bjp
ఇక బీజేపీలో చేరిన 22 మంది ఎమ్మెల్యేల్లో కాంగ్రెస్‌కు చెందిన 8 మంది గోవా ఎమ్మెల్యేలు, గుజరాత్ నుంచి నలుగురు, హిమాచల్ ప్రదేశ్ నుంచి ఇద్దరు శాసన సభ్యులు ఉన్నారు. మణిపూర్‌కు చెందిన ఐదుగురు జేడీ(యూ) ఎమ్మెల్యేలు కూడా బీజేపీలో చేరినట్లు ఈ నివేదిక పేర్కొంది.
కాగా, ఎన్పీఎఫ్, బీజేపీ తర్వాత త్రిపురా రాష్ట్రానికి చెందిన నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (ఎన్సీపీఐ) 20 మంది ప్రజాప్రతినిధులను ( 111 మందిలో 18 శాతం) తనలో చేర్చుకున్నది. 2026 పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) అధికారాన్ని కోల్పోయిన తర్వాత, ఆ పార్టీకి చెందిన 20 మంది లోక్‌సభ ఎంపీలు తిరుగుబాటు చేశారు. జూన్ 14న తక్కువ ప్రాచుర్యం కలిగిన ఎన్సీపీఐలో తమ పార్టీని విలీనం చేస్తున్నట్లు వారు తెలిపారు. లోక్‌సభలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి మద్దతు ప్రకటించారు.

Party Switching
మరోవైపు కాంగ్రెస్ పార్టీలోకి 9 మంది, శివసేనలోకి ఎనిమిది, ఎన్పీపీలోకి ఆరుగురు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్‌లో నలుగురు ఎమ్మెల్యేలు చేరారు. అయితే అత్యధిక సంఖ్యలో ఎన్డీపీపీకి చెందిన 25 మంది, టీఎంసీకి చెందిన 20 మంది, కాంగ్రెస్‌కు చెందిన 19 మంది చట్ట సభ్యులు తమ పార్టీలు మారారు. పార్టీలు మారిన 111 మంది ప్రజాప్రతినిధుల్లో ఈ మూడు పార్టీలకు చెందిన వారు 64 మంది అంటే 58 శాతం మంది ఉన్నారు. ఈ నేపథ్యంలో పార్టీ ఫిరాయింపుల నిరోధక నిబంధనలను కఠినతరం చేయాలని ఏడీఆర్ పిలుపునిచ్చింది.