‘గాయపడ్డ సింహం’ చిత్రంలో తాను అతిథి పాత్రలో కనిపిస్తానని, హీరో తరుణ్‌భాస్కర్‌తో ఓ రొమాంటిక్ ట్రాక్ కూడా ఉంటుందని, వ్లాగర్‌గా తన పాత్ర కావాల్సినంత వినోదాన్ని పంచుతుందని చెప్పింది ఫరియా అబ్దుల్లా. తరుణ్‌భాస్కర్ కథానాయకుడిగా కశ్యప్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన ‘గాయపడ్డ సింహం’ చిత్రం మే 1న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా సోమవారం ఫరియా అబ్దుల్లా విలేకరులతో సినిమా విశేషాలను పంచుకుంది. తన పాత్ర పేరు శాలిని అని, ఆద్యంతం వినోదప్రధానంగా సాగుతుందని తెలిపింది.
తరుణ్‌భాస్కర్ కామెడీ టైమింగ్ అద్భుతమని, ఆయన చిన్న ఎక్స్ప్రెషన్ కూడా నవ్వు తెప్పిస్తుందని, తమ మధ్య వచ్చే సన్నివేశాలు హిలేరియస్‌గా ఉంటాయని ఫరియా అబ్దులా పేర్కొన్నది. దర్శకత్వం చేయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని, ప్రస్తుతం కొన్ని కథల్ని సిద్ధం చేసే పనిలో బిజీగా ఉన్నానని, వచ్చే ఏడాది తప్పకుండా సినిమా డైరెక్షన్ చేస్తానని చెప్పింది. తదుపరి సినిమా వివరాలు తెలియజేస్తూ ‘ప్రస్తుతం ‘భగవంతుడు’ ‘సిగ్మా’ చిత్రాల్లో నటిస్తున్నా. మరో రెండు సినిమాలు త్వరలో ప్రారంభమవుతాయి. సత్యదేవ్‌తో ఓ సినిమా ఉంటుంది’ అని చెప్పింది.