ప్రముఖ తమిళ నటుడు ఢిల్లీ గణేశ్(80) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. 1964-74 మధ్య ప్రాంతంలో ఆయన ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో పనిచేశారు. కె.బాలచందర్ ‘పట్టిన ప్రదేశం’ నటుడిగా ఆయన తొలి సినిమా. ‘ఎంగమ్మ మహారాణి’ అనే సినిమాలో హీరోగా కూడా నటించారు. దాదాపు 400కు పైగా చిత్రాల్లో నటించారు. సింధుభైరవి, నాయగన్, శ్రీరాఘవేంద్ర, ఛత్రియన్, ఇరువర్, ఆహా, సామీ తదితర చిత్రాలు ఆయనకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. కమల్‌హాసన్‌కి ఆయన ఇష్టమైన నటుడు. అందుకే.. కమల్ నటించిన ఎక్కువ చిత్రాల్లో ఢిల్లీ గణేష్ కూడా ఉండేవారు. అపూర్వ సహోదరగల్, మైఖేల్ మదన కామరాజన్, తెనాలి.. ఇలా చెప్పుకుంటూపోతే వారి కలయికలో చాలా సినిమాలొచ్చాయి. ఢిల్లీ గణేశ్ మరణ వార్తతో తమిళ చిత్రరంగంలో విషాద ఛాయలు అలముకున్నాయి.