Tripti Dimri | బాలీవుడ్లో ప్రేమకథా చిత్రాలకు పెట్టింది పేరు దర్శకుడు ఇంతియాజ్ అలీ. తాజాగా ఆయన మరో ప్రేమకథా చిత్రానికి సిద్ధమవుతున్నారు. ‘ఇడియట్స్ ఆఫ్ ఇస్తాంబుల్’ పేరుతో తెరకెక్కించబోతున్న ఈ సినిమాలో మలయాళ అగ్ర నటుడు ఫహాద్ ఫాజిల్, ‘యానిమల్’ ఫేమ్ త్రిప్తి దిమ్రి జంటగా నటించబోతున్నారు. ఫహాద్ ఫాజిల్ ఈ సినిమా ద్వారా బాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. హాస్యప్రధానంగా సాగే ప్రేమకథగా దర్శకుడు ఇంతియాజ్ అలీ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నాడని, టర్కీలోని ఇస్తాంబుల్‌కు నాయకానాయికల ప్రయాణం, ఈ నేపథ్యంలో వారిమధ్య చోటుచేసుకునే సంఘటనలే చిత్ర ఇతివృత్తమని చెబుతున్నారు.
ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ దశలో ఉన్న ఈ సినిమా ఫిబ్రవరిలో సెట్స్‌మీదకు వెళ్లనున్నట్లు తెలిసింది. తక్కువ రోజుల్లోనే షూటింగ్‌ను పూర్తి చేసి 2025 ద్వితీయార్థంలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఫహాద్ ఫాజిల్ ఇటీవలే విడుదలైన ‘పుష్ప-2’ చిత్రంలో భన్వర్‌సింగ్ షెకావత్ పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ప్రతినాయక ఛాయలతో సాగిన ఈ పాత్రకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు దక్కింది.