హిందీ కౌన్ బనేగా కరోడ్ పతి ఆధారంగా తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరులు అనే కార్యక్రమం రూపొందిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ షోకి నాగార్జున, చిరంజీవి హోస్ట్‌లుగా వ్యవహరించారు. ఆ సమయంలో టీఆర్పీ పెద్దగా రాకపోవడంతో కొద్ది రోజులు షోకి బ్రేక్ పడింది. ఇక ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ఎన్టీఆర్ హోస్ట్‌గా షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఎపిసోడ్ గ్రాండ్‌గా లాంచ్ కాగా, కర్టన్ రైజర్ షోకి రామ్ చరణ్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఆగస్టు 22, 23న ప్రసారం అయిన ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ ప్రారంభ ఎపిసోడ్‌కు సంబంధించిన రేటింగ్ తాజాగా వెలువడింది. దీనికి రికార్డు స్థాయిలో 11.40 టీఆర్పీ రేటింగ్ దక్కింది. ఇది ఈ షో చరిత్రలోనే అత్యధిక రేటింగ్ కావడం విశేషం. గతంలో ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ షో నాలుగు సీజన్లకు సంబంధించిన ప్రారంభ ఎపిసోడ్ రేటింగ్‌ను పరిశీలిస్తే.. అక్కినేని నాగార్జున హోస్ట్ చేసిన మొదటి సీజన్‌కు 9.70, రెండో సీజన్లో 8.20, మూడో సీజన్లో 6.72, మెగాస్టార్ చిరంజీవి నడిపించిన నాలుగో సీజన్లో 3.62 రేటింగ్ మాత్రమే దక్కింది.
బిగ్ బాస్ షోతో బుల్లితెరపై అదరగొట్టిన ఎన్టీఆర్ ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతోను సరికొత్త రికార్డ్ సృష్టించాడు. అయితే తెలుగు బిగ్ బాస్ ప్రారంభ ఎపిసోడ్ రేటింగ్ 18 పైనే నమోదైంది. దానితో పోల్చుకుంటే ‘ఎవరు మీలో కోటీశ్వరులుసకు చాలా తక్కువ వచ్చిందనే టాక్ వినిపిస్తుంది.