నవీన్‌చంద్ర కథానాయకుడిగా నటించిన బైలింగ్వల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ‘ఎలెవన్’. లోకేశ్ అజ్ల్స్ దర్శకుడు. అజ్మల్‌ఖాన్, రేయా హరి నిర్మాతలు. ప్రముఖ పంపిణీదారుడు ఎన్.సుధాకర్‌రెడ్డి ఈ సినిమా థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్నారు. ఈ నెల 16న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన హీరో సందీప్‌కిషన్ చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. హీరో నవీన్‌చంద్ర మాట్లాడుతూ ‘నేను ఎన్నుకునే కథలు బావుంటాయని అందరూ అంటారు. ఆ నమ్మకాన్ని రెట్టింపు చేస్తుందీ సినిమా. నిర్మాతలు ఎంతో పాషన్‌తో సినిమా తీశారు. ఆడియన్స్‌కి గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే ఉద్దేశ్యంతో అందరం చాలా హార్డ్‌వర్క్ చేశాం.
ఇప్పటివరకూ ఏ థ్రిల్లర్‌లోనూ కనిపించని యూనిక్ కాన్సెప్ట్ ఇది. సాంకేతికంగా చాలా రిచ్‌గా ఉంటుందీ సినిమా.’ అని తెలిపారు. ఇంకా చిత్ర దర్శకుడు లోకేష్ అజ్ల్స్, కథానాయిక రియా, నటి అభిరామి, సంగీత దర్శకుడు డి.ఇమాన్లతోపాటు అతిథులుగా విచ్చేసిన దర్శకులు సాయిరాజేష్, కరుణకుమార్, శ్రీకాంత్ నాగోతి, అనిల్ విశ్వనాథ్, రచయిత లక్ష్మీభూపాల, గీత రచయిత రాకేందుమౌళి కూడా మాట్లాడారు.