Eesha Rebba | ఈషా రెబ్బా తెలుగు సినీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం నిరంతరం ప్రయత్నిస్తున్న నటీమణుల్లో ఒకరు. ‘అంతకు ముందు ఆ తర్వాత’ సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ఈషా, ఆ తర్వాత ‘బందిపోటు’, ‘అమీ తుమీ’, ‘మాయా మాల్’, ‘దర్శకుడు’, ‘సుబ్రహ్మణ్యపురం’, ‘బ్రాండ్ బాబు’, ‘అ!’, ‘రాగల 24 గంటల్లో’, ‘మామా మశ్చీంద్ర’ వంటి పలు సినిమాల్లో నటించింది. అలాగే ‘అరవింద సమేత వీరరాఘవ’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ వంటి పెద్ద చిత్రాల్లో కీలక పాత్రల్లో కనిపించింది. అందం, అభినయం ఉన్నప్పటికీ ఆశించిన స్థాయిలో పెద్ద అవకాశాలు రాకపోవడం తన కెరీర్లో ఒక లోటుగానే ఉందని చెప్పుకోవచ్చు. నేడు ‘ఓం శాంతి శాంతి శాంతిః’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈషా రెబ్బా, ప్రమోషన్స్‌లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ‘అరవింద సమేత వీరరాఘవ’ సినిమాలో నటించిన అనుభవాలను ఓపెన్‌గా పంచుకుంది.
జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటించగా, ఆమె చెల్లెలి పాత్రలో ఈషా రెబ్బా కనిపించింది. అప్పటికే హీరోయిన్గా సినిమాలు చేస్తున్న ఈషా, అంతగా ప్రాధాన్యం లేని సపోర్టింగ్ రోల్ చేయడంపై అప్పట్లో విమర్శలు కూడా ఎదుర్కొంది. దీనిపై స్పందించిన ఈషా, ‘అరవింద సమేత’ కథ విన్నప్పుడే ఆ సినిమాలో నటించాలని నిర్ణయించుకున్నానని చెప్పింది. త్రివిక్రమ్ దర్శకత్వం, పెద్ద ప్రొడక్షన్ హౌస్, భారీ ప్రాజెక్ట్ కావడంతో ఈ సినిమాలో భాగం కావడం తనకు చాలా ఇష్టంగా అనిపించిందని తెలిపింది. అయితే కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ కాకుండా వేరే పాత్రలు చేస్తే, భవిష్యత్తులో కూడా అలాంటి రోల్స్‌కే పరిమితం చేస్తారేమో అన్న భయం అప్పట్లో తనలో ఉందని అంగీకరించింది. మొదట తనది లీడ్ రోల్ అని చెప్పడంతో హ్యాపీగా ఫీలయ్యానని, కానీ స్టీరియోటైప్ అవుతానేమో అన్న టెన్షన్ కూడా వెంటాడిందని వివరించింది.
షూటింగ్ ప్రారంభమైన తర్వాత మాత్రం ఆ భయాలన్నింటినీ పక్కనపెట్టి తన పని తాను చేసుకుంటూ వెళ్లానని ఈషా తెలిపింది. అయితే సినిమా విడుదలైన తర్వాత చాలామంది తనకు ఫోన్ చేసి ‘ఈ సినిమా ఎందుకు చేసావు? ఆ పాత్రలో అంతగా ఏముంది?’ అంటూ ప్రశ్నించారని, అవి తనను చాలా బాధపెట్టాయని చెప్పింది. ఆ సమయంలో తాను నిజంగా డౌన్ అయిపోయానని కూడా వెల్లడించింది. తనకు హీరోయిన్ పాత్రలతో పాటు ఇతర క్యారెక్టర్లు చేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదని, కానీ అలాంటి రోల్స్ ఎక్కువగా చేస్తే ప్రేక్షకులు తనను హీరోయిన్గా అంగీకరించరేమో అన్న భయం మాత్రం ఇంకా ఉందని ఈషా రెబ్బా చెప్పుకొచ్చింది.