అఖిల్‌రాజ్, త్రిగుణ్, హెబ్బాపటేల్ ప్రధాన పాత్రధారులుగా రూపొందిన హారర్ థ్రిల్లర్ ‘ఈషా’. శ్రీనివాస్ మన్నె దర్శకుడు. హేమ వెంకటేశ్వరరావు నిర్మాత. ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదరప్రసాద్ సమర్పకుడు. ఈ నెల 25న క్రిస్మస్ కానుకగా సినిమా విడుదల కానున్నది. బన్నీవాస్, వంశీ నందిపాటి తెలుగు రాష్ర్టాల్లో సినిమాను విడుదల చేస్తున్నారు. హార్ట్ వీక్ ఉన్నవాళ్లు ఈ సినిమా చూడొద్దంటూ ఇటీవలే మేకర్స్ ఓ ప్రకటనలో పేర్కొన్న విషయం తెలిసిందే.
ఈ క్రమంలో ‘ఈషా వార్నింగ్’ పేరిట చిత్ర నిర్మాతలు శనివారం ఓ వీడియోను విడుదల చేశారు. ‘మనుషుల్లాగే, కొన్ని ప్రదేశాలు కూడా పుట్టుకతోనే శాపగ్రస్తమై ఉంటాయి.. కాలక్రమంలో అవి ఆత్మలకు నిలయాలుగా మారతాయి..’ అంటూ ఈ తాజా వీడియోలోని మాటలు ఆడియన్స్‌కి వార్నింగ్‌ని జారీ చేస్తూ వినిపించాయి. హారర్ సినిమాలు విడుదల అవుతున్న సమయంలో సదరు చిత్రాల మేకర్లు ఇలా వీడియో విడుదల చేయడం ఇదే ప్రథమమని మేకర్స్ తెలిపారు. ఉలిక్కిపడే మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా ఈ సినిమా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు.