ED summons డ్రగ్స్ సరఫరా, మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో విచారణకు హాజరు కావాలంటూ తమిళ నటులు కె. శ్రీకాంత్(శ్రీరామ్), కృష్ణ కుమార్‌లకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) సమన్లు జారీ చేసింది. ఈ ఇద్దరు నటులను వచ్చే వారం విచారించనున్నట్లు ఈడీ అధికారులు తెలిపారు. అక్టోబర్ 28న శ్రీకాంత్‌ను, అక్టోబర్ 29న కృష్ణ కుమార్‌ను చెన్నైలోని నుంగంబాక్కంలో ఉన్న తమ జోనల్ కార్యాలయంలో విచారణాధికారి ముందు హాజరు కావాలని ఈడీ ఆదేశించింది.
చెన్నై పోలీసులు నమోదు చేసిన ఒక కోకైన్ సరఫరా కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ దర్యాప్తును ప్రారంభించింది. ఈ ఏడాది జూన్‌లో చెన్నై పోలీసులు శ్రీకాంత్, కృష్ణ కుమార్‌లను డ్రగ్స్ కేసులో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ వినియోగం కోసం కొనుగోలు చేసిన ఆరోపణలపై వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వారి వద్ద ఎటువంటి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకోనందున మద్రాస్ హైకోర్టు వారికి జూలై 8, 2025న షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ కేసులో మాదకద్రవ్యాల అక్రమ రవాణా ద్వారా వచ్చిన డబ్బు లావాదేవీలను గుర్తించడానికి ఈడీ ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. ఇందులో భాగంగానే ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ (PMLA) కింద నటుల వాంగ్మూలాలను ఈడీ నమోదు చేయనుంది.