సినీతారలపై నమోదైన డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకి వచ్చింది. నాలుగేండ్ల క్రితం సంచలనం సృష్టించిన ఈ కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న పలువురు సినీ ప్రముఖులకు ఈడీ అధికారులు బుధవారం నోటీసులు జారీ చేసినట్టు సమాచారం. పీఎంఎల్ఏ(ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్యాక్ట్)లోని సెక్షన్ 50 ప్రకారం ఈ నోటీసులు జారీ చేసినట్టు తెలిసింది. ఈనెల 31 నుంచి సెప్టెంబర్ 22 వరకు హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి నోటీసులు పంపినట్టు తెలిసింది. మొత్తం 12 మంది సినీ పరిశ్రమకు చెందిన వారికి ఈ నోటీసులు అందినట్టు సమాచారం. డ్రగ్స్ కొనుగోళ్లలో మనీలాండరింగ్ జరిగి ఉండొచ్చని ఈడీ అనుమానిస్తున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయమైన మరింత సమాచారం సేకరించేందుకు 12 మందికి నోటీసులు జారీ చేసి ఉండొచ్చని ఓ అధికారి తెలిపారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం నోటీసులు అందుకున్న వారిలో పూరి జగన్నాథ్, చార్మి కౌర్, రకుల్‌ప్రీత్‌సింగ్, రానా దగ్గుబాటి, రవితేజ, శ్రీనివాస్, నవదీప్, జనరల్ మేనేజర్ ఎఫ్-క్లబ్, ముమైత్‌ఖాన్, తనీశ్, నందు, తరుణ్‌లు ఉన్నట్టు తెలిసింది. కాగా, 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో హీరో రవితేజ, పూరిజగన్నాథ్, నవదీప్, ముమైత్‌ఖాన్, తరుణ్, నందు సహా పలువురిని విచారించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎక్సైజ్‌శాఖ అధికారులు ఇప్పటికే 12 చార్జిషీట్లను దాఖలు చేశారు. డ్రగ్స్ కొనుగోలు వ్యవహారంలో మనీ లాండరింగ్ జరిగి ఉండే అవకాశం ఉన్నందున కేసు వివరాణలు ఇవ్వాల్సిందిగా తెలంగాణ ఎక్సైజ్‌శాఖను ఈడీ కోరింది. ఈ మేరకు ఎక్సైజ్‌శాఖ అధికారులు కేసు సీఓఆర్(కేస్ అక్కరెన్స్ రిపోర్ట్)తోపాటు పలు వివరాలు పంచుకున్నారు. అదేవిధంగా చార్జిషీట్ కోర్టుకు దాఖలు చేసినందున మిగిలిన వివరాలు కోర్టు నుంచి తీసుకోవాల్సిందిగా ఈడీ అధికారులకు సూచించారు. పూర్తి వివరాలు సేకరించిన ఈడీ అధికారులు తాజాగా 12 మందికి విచారణకు హాజరుకావాలంటూ నోటీసులు జారీ చేసింది.