టాలీవుడ్ డ్రగ్స్‌కేసులో ఈడీ విచారణ కొనసాగుతోంది. ఈడీ అధికారులు ఇప్పటికే ఇచ్చిన సమన్ల ప్రకారం ఈనెల 8న హీరో దగ్గుబాటి రానా హాజరుకావాల్సి ఉంది. ఇప్పటికే దర్శకుడు పూరీ జగన్నాథ్, హీరోయిన్లు చార్మికౌర్, రకుల్‌ప్రీత్‌సింగ్‌లను ఈడీ అధికారులు ప్రశ్నించిన విషయం తెలిసిందే. డ్రగ్స్ సరఫరా చేసిన కెల్విన్ ఇచ్చిన సమాచారం, అతడి బ్యాంక్ ఖాతాలకు సంబంధించిన లావాదేవీల ఆధారంగా ఈడీ అధికారులు పలువురు తెలుగు సినీ ప్రముఖులకు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే 2017లో ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులో లేకుండా కేవలం ఈడీ సమన్లు అందుకున్న వారిలో రకుల్‌ప్రీత్‌సింగ్‌ను ఇప్పటికే ప్రశ్నించగా..బుధవారం నాటి విచారణకు హీరో దగ్గుబాటి రానా హాజరువుతుండడం ఆసక్తికరంగా మారింది. హీరో నవదీప్‌కు చెందిన ఎఫ్ క్లబ్లో పలుసార్లు నిర్వహించిన పార్టీలకు రకుల్, రానా ఇంకా ఇతరులు హాజరైనట్టు ఉన్న పక్కా సమాచారం ప్రకారమే ఈడీ వారికి సైతం సమన్లు ఇచ్చినట్టు సమాచారం. హీరో రానాకు సంబంధించిన బ్యాంకు ఖాతాల వివరాలు సైతం ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించినట్టు ప్రచారం సాగుతోంది. దీని ఆధారంగా, అందులోని లావాదేవీలు, ఎక్సైజ్‌శాఖ నమోదు చేసిన కేసులోని ఇతరులతో ఉన్న సంబంధాలపైనా రానాను ఈడీ అధికారులు ప్రశ్నించే అవకాశం ఉన్నట్టు తెలుస్తున్నది.