Rajendran | మలయాళ సినీ పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నటుడు, దర్శకుడు ఈ.ఏ. రాజేంద్రన్ (71) గురువారం తెల్లవారుజామున కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, కేరళలోని కొల్లంలో ఉన్న తన స్వగృహంలో తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు శుక్రవారం త్రిసూర్‌లో నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.మలయాళ నాటక రంగంలో దిగ్గజంగా గుర్తింపు పొందిన రాజేంద్రన్, తన నటనతో ప్రత్యేక స్థానాన్ని సంపాదించారు. నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో శిక్షణ పొందిన ఆయన, రంగస్థలం నుంచి సినీరంగానికి అడుగుపెట్టి తన ప్రతిభను చాటుకున్నారు. సుమారు 60కి పైగా మలయాళ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ప్రత్యేకంగా ‘నరసింహం’, ‘మీసమాధవన్’, ‘కలియాట్టం’ వంటి చిత్రాల్లో విలన్, క్యారెక్టర్ పాత్రలతో మంచి గుర్తింపు పొందారు. టెలివిజన్ సీరియల్స్‌లో కూడా కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులకు చేరువయ్యారు.రాజేంద్రన్ వ్యక్తిగత జీవితానికొస్తే, ఆయన ప్రముఖ నటుడు, ఎమ్మెల్యే ముఖేశ్‌కు బావ. ఆయన భార్య సంధ్య, కుమారుడు దివ్యదర్శన్ కూడా సినీ రంగంలో కొనసాగుతున్నారు.రాజేంద్రన్ మృతిపై కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సినీ, నాటక రంగాలకు ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు.
కాగా, కొద్ది రోజుల క్రితం ‘సూపర్ మ్యాన్’ ఫేమ్ వాలెరీ పెర్రీస్, రాజస్థాన్ యువ నటి హర్షిల్ కాలియా కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆ మరణ వార్త మరవక ముందే ఇప్పుడు ప్రముఖ దర్శకుడు కన్నుమూయడం సినీ ప్రియులని కలిచివేస్తుంది. నాటక రంగం నుంచి సినీ రంగం వరకు తనదైన ముద్ర వేసిన ఈ.ఏ. రాజేంద్రన్ మరణం మాలీవుడ్‌కు తీరని లోటుగా భావిస్తున్నారు. ఆయన చేసిన పాత్రలు, చూపిన నటన ఎన్నటికీ ప్రేక్షకుల మదిలో నిలిచిపోతాయని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి.