‘అందరు నన్ను రొమాంటిక్ హీరో అని పిలుస్తుండటంతో విసిగిపోయా. ఇక లవ్‌స్టోరీస్ చేయొద్దనుకున్నా. కానీ హను రాఘవపూడి అద్భుతమైన ప్రేమకథ చెప్పారు. చిరకాలం గుర్తుండిపోయే ఎపిక్ లవ్‌స్టోరీ ఇది’ అని అన్నారు దుల్కర్ సల్మాన్. ఆయన కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ‘సీతా రామం’. మృణాల్ ఠాకూర్ కథానాయిక. రష్మిక మందన్న కీలక పాత్రలో నటించింది.
ఈ చిత్ర ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ ‘నా కెరీర్లో ‘సీతా రామం’ ఓ క్లాసిక్ లవ్‌స్టోరీగా మిగిలిపోతుంది. ఈ సినిమా కోసం దేశంలోని అనేక ప్రదేశాలు తిరిగాం. ఇదొక లార్జర్ దెన్ లైఫ్సినిమా’ అని చెప్పారు. ఈ సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమని తాము మర్చిపోతారని, కేవలం కథ..పాత్రలు మాత్రమే గుర్తుంటాయని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.
రష్మిక మందన్న మాట్లాడుతూ ‘ఈ సినిమాలో అఫ్రిన్ అనే ధైర్యవంతురాలైన అమ్మాయి పాత్రను పోషించా. ఈ అందమైన ప్రేమకథను నా పాత్ర వివరిస్తుంది. సీత రామ్ ప్రణయాన్ని అఫ్రిన్ చెప్పే విధానం చాలా కొత్తగా ఉంటుంది’ అని తెలిపింది. తాను పోషించిన సీత పాత్ర అద్భుతంగా ఉంటుందని, కథ చెప్పినప్పుడే ఆ పాత్ర ప్రేమలో పడిపోయానని కథానాయిక మృణాల్ ఠాకూర్ పేర్కొంది.
స్క్రిప్ట్ మొత్తం చదివిన తర్వాత ఈ సినిమా ఓ దృశ్యకావ్యం అవుతుందనే భావన కలిగిందని సుమంత్ చెప్పారు. నిర్మాత అశ్వనీదత్ మాట్లాడుతూ ‘కరోనా ఉధృతంగా ఉన్న సమయంలో కశ్మీర్, గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, రష్యా వంటి ప్రదేశాల్లో చిత్రీకరణ చేశాం. హృద్యమైన ప్రేమకథగా ఆకట్టుకుంటుంది’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.