మహానటి, సీతారామం, లక్కీభాస్కర్ చిత్రాలతో తెలుగులో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్నారు మలయాళ అగ్ర నటుడు దుల్కర్ సల్మాన్. ముఖ్యంగా గత ఏడాది తెలుగులో ఆయన నటించిన ‘లక్కీభాస్కర్’ వందకోట్ల విజయాన్ని సాధించింది. టాలీవుడ్ ప్రేక్షకులు దుల్కర్‌ను ఎంతగా ఓన్ చేసుకున్నారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. అందుకే మరో క్రేజీ తెలుగు ప్రాజెక్ట్‌తో ప్రేక్షకుల్ని పలకరించనున్నారు దుల్కర్. సినిమా పేరు ‘ఆకాశంలో ఒక తార’. పవన్ సాదినేని దర్శకుడు.
సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మాతలు. ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా ఈ చిత్రాన్ని సమర్పిస్తుండటం విశేషం. ఆదివారం హైదరాబాద్‌లో ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ముహూర్తపు సన్నివేశానికి అగ్ర నిర్మాత అల్లు అరవింద్ క్లాప్ ఇవ్వగా, మరో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్ కెమెరా స్విచాన్ చేశారు. గుణ్ణం గంగరాజు గౌరవ దర్శకత్వం వహించారు. సినిమాకు సంబంధించిన ఇతర నటీనటుల వివరాలు త్వరలో ప్రకటిస్తామని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రానికి రచన: గుణ్ణం గంగరాజు, కెమెరా: సుజిత్ సారంగ్, నిర్మాణం: లైట్ బాక్స్ మీడియా.