రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే కరోనా ప్రభావంతో పరిస్థితులు ఇంకా సాధారణ స్థితికి రాకపోవడంతో సినిమా రిలీజ్‌ను వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. దీంతో పలు సినిమాలు దసరా బరిలో విడుదలకి సిద్ధం అవుతున్నాయి.
ఇప్పటికే అజయ్ భూపతి డైరెక్ట్ చేస్తున్న మహా సముద్రం దసరా బరిలో ఉంది. అక్టోబర్ 14న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. మరోవైపు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అక్కినేని అఖిల్, పూజా హెగ్డే కాంబోలో వస్తున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ కూడా అక్టోబర్ 8న విడుదల కానుంది. దృశ్యం 2 చిత్రాన్ని కూడా దసరా బరిలో నిలపాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్టు కొద్ది రోజులుగా వార్తలు వచ్చాయి.
ఆర్ఆర్ఆర్ చిత్రం వాయిదా పడడంతో మూవీని అక్టోబర్ 13న రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ముందు ఈ సినిమాని ఓటీటీలో విడుదల చేయనున్నారని వార్తలు వచ్చాయి. కాని థియేటర్లోనే సినిమాని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఆసక్తి చూపుతున్నారట. త్వరలోనే దీనిపై క్లారిటీ రానుంది. మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన దృశ్యం చిత్రానికి సీక్వెల్ గా వస్తుంది దృశ్యం 2. వెంకటేష్,మీనా, కృతిక, ఎస్తేర్ అనిల్, నదియా, సంపత్ రాజ్, నరేశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సురేశ్ ప్రొడక్షన్స్, ఆశీర్వాద్ సినిమాస్, రాజ్ కుమార్ థియేటర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి.