Drugs | తెలంగాణలో డ్రగ్స్ వంటి మత్తు పదార్థాలపై ఉక్కుపాదం మోపేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన “ఈగల్” (EAGLE) ఫోర్స్ దాడులు మరింత ఉధృతం అవుతున్నాయి. ఇటీవల పబ్‌లు, రిసార్టులు, ప్రైవేట్ పార్టీలపై వరుసగా దాడులు నిర్వహిస్తున్న ఈగల్ టీమ్ తాజాగా మరో కీలక ఆపరేషన్ చేపట్టింది. శనివారం అర్ధరాత్రి తారామతి బరదరి రిసార్ట్ వద్ద ఈగల్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గోల్కొండ పరిధిలోని ఈ చారిత్రాత్మక ప్రదేశంలో నిర్వహించిన “జాక్ అండ్ జాన్సన్” అనే హైప్రొఫైల్ ఈవెంట్లో భారీగా డ్రగ్స్ వినియోగం జరుగుతున్నట్లు ముందస్తు సమాచారం అందడంతో అధికారులు రంగంలోకి దిగారు.
సమాచారం మేరకు, ఆ ఈవెంట్‌కు పెద్ద ఎత్తున యువత హాజరైనట్లు తెలుస్తోంది. అంతేకాకుండా బాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు కూడా ఈ పార్టీలో పాల్గొన్నారని సమాచారం. దీంతో ఈ దాడి మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈగల్ టీమ్ అధికారులు అక్కడికి చేరుకున్న వెంటనే రిసార్ట్ మొత్తం తమ ఆధీనంలోకి తీసుకుని సోదాలు ప్రారంభించారు. అనుమానం ఉన్న వ్యక్తులతో పాటు అక్కడ ఉన్న చాలా మందికి అక్కడికక్కడే డ్రగ్స్ టెస్టులు నిర్వహించారు. ఈ ఆపరేషన్‌ను అత్యంత గోప్యంగా నిర్వహించిన అధికారులు, హైదరాబాద్ సిటీ పోలీస్ టాస్క్ ఫోర్స్ సహకారం కూడా తీసుకున్నట్లు సమాచారం.
ఇటీవలే కొండాపూర్‌లోని ఓ పబ్‌పై ఈగల్ టీమ్ నిర్వహించిన దాడుల్లో పలువురు డ్రగ్స్ వినియోగదారులు పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ ఘటన తర్వాత నగరంలోని పబ్‌లు, ఫామ్‌హౌస్‌లు, రిసార్టులపై నిఘా మరింత పెంచిన అధికారులు ఇప్పుడు వరుస తనిఖీలతో డ్రగ్స్ నెట్‌వర్క్‌ను పూర్తిగా నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈగల్ ఫోర్స్‌ను ఏర్పాటు చేసి దాన్ని మరింత బలోపేతం చేసింది. హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల్లో జరిగే రేవ్ పార్టీలపై కళ్లేసేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌తో పాటు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీని కూడా వినియోగిస్తున్నారు. అయితే తారామతి రిసార్ట్‌లో నిర్వహించిన ఈ తాజా తనిఖీలలో ఎంతమందికి డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది, ఎవరెవరిని అదుపులోకి తీసుకున్నారు అనే విషయాలపై అధికారిక సమాచారం ఇంకా వెలువడాల్సి ఉంది. ఈ దాడి నేపథ్యంలో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని భావిస్తున్నారు.