Abhishek and Shivaleeka | బాలీవుడ్లో పెండ్లిండ్ల సీజన్ నడుస్తున్నది. రెండు రోజుల క్రితమే బాలీవుడ్ జంట సిద్దార్థ మల్హోత్రా – కియారా అద్వానీ వివాహం జరిగింది. ఇదే వరసలో మరో బాలీవుడ్ జంట పెండ్లి పీటలకెక్కింది. ఖుదా హపీజ్ సినిమాతో బాలీవుడ్ నటిగా పేరుతెచ్చుకున్న శివాలీకా ఒబెరాయ్‌ను దృశ్యం 2 డైరెక్టర్ అభిషేక్ పాఠక్ వివాహమాడారు. గోవాలోని ఓ రిసార్ట్‌లో కుటుంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో వీరిద్దరూ ఒక్కటయ్యారు. వీరి వివాహం ఈ నెల 9 న జరగ్గా.. తమ పెండ్లి వీడియోను శివాలీకా ఒబెరాయ్ తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో ఇవాళ షేర్ చేసింది.
అభిషేక్ పాఠక్ దర్శకత్వం వహించి ఖుదా హఫీజ్ సినిమా చిత్రీకరణ సమయంలో వీరి మధ్య ప్రేమ మొగ్గ తొడిగింది. ఈ సినిమా పూర్తయ్యే సరికి ఇద్దరి మధ్య విడదీయలేనంత బంధం అల్లుకున్నది. దాంతో వారిద్దరు ఒక్కటవ్వాలని నిర్ణయించుకుని పెద్దల అనుమతితో గోవాలో ఏడడుగులు నడిచారు. పెండ్లి వీడియోను షేర్ చేయడానికి ముందుగా ఈ జంట తమ వివాహానికి సంబంధించిన ఫొటోలను షేర్ చేశారు. ఫ్రెంచ్ నవలా రచయిత అనైస్ నిన్ నుంచి తీసుకున్న కోట్‌ను దీనికి శీర్షికగా పెట్టారు. ‘మీకు మీ ప్రియమైన వ్యక్తి కనిపించలేదు. అతను మీ కోసం వెతుకుతున్నాడు. ఇది మీ విధిలో వ్రాయబడింది’ అని పోస్ట్‌లో రాసింది.
‘ఇది ఎప్పటికీ మా జీవితంలో అత్యంత అద్భుతమైన క్షణాలు. హృదయాల నిండా ప్రేమ, జ్ఞాపకాలు పుష్కలంగా ఉన్నాయి. మేము దీన్ని మరింత ప్రత్యేకంగా చేయడానికి ఈ కొత్త ప్రయాణాన్ని కలిసి ప్రారంభించేందుకు ఇంకా వేచి ఉండలేము. మీ ప్రేమ, ఆశీస్సులు మాకు కావాలి..’ అని శివాలీకా ఒబెరాయ్ వ్యాఖ్యానంతో వీడియో నడుస్తుండటం ప్రత్యేకత. పెండ్లి బంధంతో ఒక్కటైన అభిషేక్ పాఠక్, శివాలీకా ఒబెరాయ్‌కు మనం కూడా విషెస్ చెప్దాం.