మలయాళంలో ‘దృశ్యం’ ఫ్రాంచైజీ ఓ సంచలనం. ఇప్పటివరకూ ఈ ఫ్రాంచైజీలో రెండు సినిమాలొచ్చాయి. ఈ ఫ్రాంచైజీ ఇతర భాషల్లోనూ రీమేక్ అయ్యి.. ప్రతి భాషలోనూ భారీ విజయాలను అందుకుంది. ఆ విధంగా దేశవ్యాప్తంగా ‘దృశ్యం ఫ్రాంచైజీ’ ఓ సెన్సేషన్. ఏదేమైనా ఈ క్రెడిట్ పూర్తిగా మాతృకల దర్శకుడైన జీతూ జోసఫ్కే దక్కుతుంది. ప్రస్తుతం జీతూ ‘దృశ్యం 3’ తెరకెక్కించే పనిలో ఉన్నారు.
ఈ సినిమా కూడా ఇతర భాషల్లో రీమేక్ అవ్వడం ఖాయం అని అందరూ అనుకుంటున్న తరుణంలో.. ‘దృశ్యం 3’ని రీమేక్ చేయాలని చూస్తున్న ఇతర భాషలకు చెందిన మేకర్లందరి ఉత్సాహానికీ హీరో మోహన్‌లాల్ అడ్డుకట్ట వేశారు.
మలయాళంలో రూపొందుతున్న ‘దృశ్యం 3’ ఈ దఫా పానిండియా స్థాయిలో విడుదల కానుంది. అన్ని భాషల్లోనూ ఇక హీరో మోహన్‌లాలే. దర్శకుడు జీతూ జోసఫ్పే. మలయాళంలో వందకోట్లు, హిందీలో రెండొందల కోట్లు, ఇతర భాషలన్నీ కలిసి ఓ రెండొందల కోట్లు.. ఇలా రమారమీ ఓ అయిదొందల కోట్లకు టార్గెట్ పెట్టారు హీరో మోహన్‌లాల్.