ధర్మ, ఐశ్వర్యశర్మ జంటగా నటించిన చిత్రం ‘డ్రింకర్ సాయి’. ‘బ్రాండ్ ఆఫ్ బ్యాడ్ బాయ్స్’ అనేది ఉపశీర్షిక. వాస్తవ సంఘటనల ఆధారంగా దర్శకుడు కిరణ్ తిరుమలశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రానికి బసవరాజు శ్రీనివాస్, ఇస్మాయిల్ షేక్, బసవరాజు లహరిధర్ నిర్మాతలు. ఈ నెల 27న సినిమా విడుదలైంది. ఈ సందర్భంగా సినిమా సక్సెస్‌మీట్‌ను శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. ‘వ్యక్తిగా బాధ్యతాయుతమైన ప్రయాణాన్ని సాగిస్తున్న నేను ‘డ్రింకర్ సాయి’ అనే పేరుతో సినిమా చేశాను అనగానే కొందరు మిత్రులు సందేహాలు వెలిబుచ్చారు.
ఈ కథలో అద్భుతమైన సందేశం ఉంది కాబట్టే ఈ సినిమా తీశానని వారికి తర్వాత తెలిసింది. ఈ సినిమా వసూళ్ల పరంగా లాభాల బాటలో పయనిస్తున్నది. దర్శకుడు కిరణ్, హీరో ధర్మ, హీరోయిన్ ఐశ్వర్య.. ఇలా అందరూ ప్రాణం పెట్టి పనిచేశారు. టెక్నీషియన్లంతా ప్యాషనేట్‌గా వర్క్ చేశారు. వీరందరి వల్లే ఈ విజయం.’ అని నిర్మాతల్లో ఒకరైన బసవరాజు శ్రీనివాస్ తెలిపారు.
‘కొన్ని తప్పుల గురించి ఆలస్యంగా తెలుసుకుంటాం. అలర్ట్ అయ్యేలోపు జరగాల్సిన డ్యామేజీ జరిగిపోతుంది. ఇందులో హీరో అలాగే ఓ తప్పు చేస్తాడు. తర్వాత దాన్ని దిద్దుకోలేక బాధపడతాడు. ఇలా ఎవరి జీవితంలో జరగకూడదని తెలిపే ఓ మంచి సందేశమే ఈ సినిమా. ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు’ అని దర్శకుడు చెప్పారు. ఇంకా నిర్మాతలు బసవరాజు లహరిధర్, ఇస్మాయిల్ షేక్ మాట్లాడారు.