YaduVamsi | తెలుగు చలనచిత్ర పరిశ్రమలో చిన్న సినిమాగా విడుదలై భారీ విజయాన్ని అందుకున్న ‘కమిటీ కుర్రోళ్ళు’ ప్రయాణం మరో అద్భుత మైలురాయిని తాకింది. ప్రతిష్టాత్మకమైన 70వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ వేడుకల్లో ఈ చిత్రం రెండు ప్రధాన అవార్డులను కైవసం చేసుకొని టాలీవుడ్ సత్తాను చాటింది. సినిమాలో హీరోగా నటించిన సందీప్ సరోజ్‌కు ఉత్తమ తొలి పరిచయ నటుడు (బెస్ట్ డెబ్యూ మేల్) అవార్డు దక్కగా, యదు వంశీ ఉత్తమ తొలి పరిచయ దర్శకుడు (బెస్ట్ డెబ్యూ డైరెక్టర్) అవార్డును అందుకున్నారు. దక్షిణ భారత సినీ రంగంలో అత్యంత గౌరవప్రదమైన ఈ వేదికపై ఒకే సినిమాకు రెండు ప్రధాన డెబ్యూ అవార్డులు రావడం ఈ చిత్రానికి లభించిన జాతీయ స్థాయి గుర్తింపుగా చెప్పవచ్చు.
వైవిధ్యమైన కథను నమ్మి కొత్త ప్రతిభను ప్రోత్సహిస్తే ప్రేక్షకులు ఎలాంటి ఆదరణ అందిస్తారో ‘కమిటీ కుర్రోళ్ళు’ మరోసారి నిరూపించింది. సినిమాలో స్నేహం, అహం మరియు సామాజిక మార్పుల మధ్య తడబడే యువకుడి పాత్రలో సందీప్ సరోజ్ పండించిన భావోద్వేగాలు ప్రేక్షకులనే కాకుండా విమర్శకుల మనసులను కూడా గెలుచుకున్నాయి. అలాగే దర్శకుడు యదు వంశీ సామాజిక సందేశాన్ని కామెడీతో మిళితం చేసి, గోదావరి పరిసర ప్రాంతాల సహజత్వాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించారు. ఈ చిత్రం ఇప్పటికే గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్, దుబాయ్ గల్ఫ్ అకాడమీ మూవీ అవార్డ్స్ మరియు సైమా (SIIMA) వంటి ప్రతిష్టాత్మక వేదికలపై ఉత్తమ తొలి దర్శకుడు, నిర్మాత మరియు నటుడి విభాగాల్లో అవార్డులను కొల్లగొట్టింది.
నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ మరియు శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా కాసుల వర్షం కురిపించింది. సుమారు రూ. 9 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రం థియేట్రికల్ మరియు నాన్-థియేట్రికల్ పరంగా మొత్తం రూ. 24.5 కోట్ల వసూళ్లను సాధించి భారీ కమర్షియల్ సక్సెస్‌ను అందుకుంది. ప్రస్తుతం ఈ చిత్రం ‘ఈటీవీ విన్’ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతూ డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తోంది. విజయవంతంగా దశాబ్ద కాలం పూర్తి చేసుకున్న పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, భవిష్యత్తులో ‘రాకాస’ వంటి వైవిధ్యమైన సినిమాలతో పాటు యదు వంశీ దర్శకత్వంలో మరో సినిమాను మరియు 2026లో కొత్త దర్శకుడితో మరిన్ని ప్రాజెక్టులను పట్టాలెక్కించడానికి సిద్ధమవుతోంది.