హైదరాబాద్, డిసెంబర్ 31(నమస్తే తెలంగాణ) : తెలుగు చిత్ర పరిశ్రమను వివాదాల్లోకి లాగి, పరిశ్రమకు లేనిపోని రాజకీయాలను ఆపాదించొద్దని సినీ నిర్మాత, ఎఫ్డీసీ చైర్మన్ దిల్‌రాజు కోరారు. సీఎం రేవంత్‌రెడ్డితో చిత్ర పరిశ్రమ సమావేశం ఒకరిద్దరితో జరిగింది కాదని, దీనిపై మాజీ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు బాధాకరమని అన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం ట్వీట్ చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమ బాగోగుల గురించి అత్యంత స్నేహపూర్వకంగా, ఎలాంటి దాపరికాలు లేకుండా జరిగిన సమావేశంపై చిత్ర పరిశ్రమ చాలా సంతృప్తిగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పయనంలో తెలుగు చిత్ర పరిశ్రమ భాగస్వామ్యాన్ని గుర్తించి, రాష్ర్టాభివృద్ధికి, సామాజిక సంక్షేమానికి తమ బాధ్యతగా సహకరించాలని సీఎం కోరినట్టు తెలిపారు. ఇటీవల సీఎం రేవంత్‌రెడ్డితో చిత్ర పరిశ్రమ పెద్దల భేటీపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ కేవలం ప్రచారం కోసం, ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లీంచేందుకే సినిమా వాళ్ల గురించి సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. అటెన్షన్, డైవర్షన్ కోసమే సీఎం పాకులాడుతున్నారని మండిపడ్డారు.