డొమినిక్: అండ్ ది లేడీస్ పర్స్
జీ5: స్ట్రీమింగ్ అవుతున్నది
తారాగణం: మమ్ముట్టి, గోకుల్ సురేష్, సుష్మిత భట్,
విజీ వెంకటేష్, మీనాక్షి ఉన్నికృష్ణన్ తదితరులు
దర్శకత్వం: గౌతమ్ వాసుదేవ్ మీనన్
క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ కథలు.. ‘మినిమమ్ గ్యారెంటీ’ అని పేరు తెచ్చుకున్నాయి. ఎక్కువగా కొత్త డైరెక్టర్లు, చిన్నచిన్న నటీనటులతోనే ఇలాంటి స్టోరీలు తెరకెక్కుతున్నాయి. థియేటర్లతోపాటు ఓటీటీల్లోనూ మంచి ఓపెనింగ్స్ రాబడుతున్నాయి. అలాంటిది, మలయాళ సూపర్‌స్టార్ మమ్ముట్టి ప్రధాన పాత్రలో, క్రేజీ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకత్వంలో వస్తున్న క్రైమ్ థ్రిల్లర్ ఇన్వెస్టిగేషన్ సినిమా అంటే.. సమ్‌థింగ్ స్పెషల్ అనే చెప్పాలి. అందుకే, ‘డొమినిక్: అండ్ ది లేడీస్ పర్స్’ సినిమా కోసం సామాన్య ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. థియేటర్లలో మంచి హిట్ అందుకున్న ఈ సినిమా.. తాజాగా, జీ5 వేదికగా ఓటీటీలో స్ట్రీమింగ్కు వచ్చి.. ఇక్కడా రికార్డు వ్యూస్ కొల్లగొడుతున్నది.
కథలోకి ఎంటరైతే.. డొమినిక్ (మమ్ముట్టి) పోలీస్ ఆఫీసర్‌గా పనిచేస్తాడు. కొన్ని కారణాలతో ఉద్యోగాన్ని వదులుకుంటాడు. చిన్నచిన్న క్లూలతోనే పెద్దపెద్ద కేసులను సాల్వ్ చేయడంలో డొమినిక్ సిద్ధహస్తుడు. దాంతో, ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఏజెన్సీని ప్రారంభిస్తాడు. అతని దగ్గర విక్కీ (గోకుల్ సురేశ్) అసిస్టెంట్‌గా చేరతాడు. ఒక రోజు ఇంటి ఓనర్ మాధురి (విజీ వెంకటేశ్).. డొమినిక్‌ను ఓ సాయం చేయమని అడుగుతుంది. హాస్పిటల్‌కు వెళ్లినప్పుడు మాధురికి ఒక పర్స్ దొరుకుతుంది. అది ఎవరిదో కనుక్కొని.. వారికి అందజేయాలని డొమినిక్‌ను కోరుతుంది. దాంతో, ఆ పర్స్ ఎవరిదో తెలుసుకునే పనిలో పడతాడు డొమినిక్. ఆ వైపుగా ఇన్వెస్టిగేషన్ ప్రారంభించగా.. ఆ పర్స్ పూజ (మీనాక్షి ఉన్నికృష్ణన్) అనే యువతిది అని తెలుస్తుంది. అదే సమయంలో.. ఆ పర్స్ పోగొట్టుకున్న రోజునుంచే ఆమె కనిపించకుండా పోతుంది.
తన ఎక్స్ బాయ్‌ఫ్రెండ్ కార్తీక్‌ను కలుసుకోవడానికి వెళ్లిన పూజ.. మళ్లీ తిరిగి రాలేదని తెలుస్తుంది. దాంతో, కార్తీక్ ఆచూకీ కనుక్కునే పనిలో పడతాడు డొమినిక్. తన అసిస్టెంట్‌తో కలిసి కార్తీక్-పూజ చివరిసారిగా కలుసుకున్న మున్నార్‌కు వెళ్లి, విచారణ మొదలుపెడతాడు. అక్కడ మరో మిస్సింగ్ గురించి తెలుసుకుంటాడు. పూజ రెండు వారాల క్రితం మిస్సయితే, కార్తీక్ రెండేళ్ల క్రితమే కనిపించకుండా పోయాడని తెలిసి షాక్‌కు గురవుతాడు. ఇలాంటి సమయంలో.. డొమినిక్ ఇన్వెస్టిగేషన్ ఎలా సాగుతుంది? విచారణ సందర్భంగా అతనికి ఎలాంటి క్లూలు దొరికాయి? వాటి సాయంతో మిస్సింగ్‌ల మిస్టరీని ఎలా ఛేదించాడు? పూజ, కార్తీక్‌ను ఎలాంటి పరిస్థితుల్లో కనిపెట్టాడు? అనేది మిగిలిన కథ.