Kanika Dhillon | సినిమా సమీక్షకులపై నిరసనలు పెరుగుతున్నాయి. ఇటీవలే టాలీవుడ్ నటుడు శ్రీకాంత్ అయ్యంగార్ రివ్యూయర్లపై నోరు పారేసుకోగా.. తాజాగా బాలీవుడ్ కథా రచయిత్రి కనిక ధిల్లాన్ కూడా మండిపడ్డారు. తన తాజా చిత్రం ‘దో పట్టి’పై కొందరు ప్రతికూల సమీక్షలు రాశారు. హిందీ చిత్రసీమలో విభిన్నమైన కథలను అందిస్తున్న రచయిత్రిగా పేరున్న కనిక.. ఈ నెగెటివ్ రివ్యూలపై స్పందించారు. ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో అదే విషయమై మాట్లాడారు. “ప్రేక్షకులకు మంచి సినిమా అందించడానికి ఏమేం చేయాలో.. అన్నీ చేస్తాం. వారు ఆ సినిమాను చూసి.. అందులోని సందేశాన్ని గ్రహిస్తే చాలని కోరుకుంటాం.
అసలు మేం సినిమాలు చేసేదే ప్రేక్షకుల కోసం. మధ్యలో ఈ సమీక్షకులు ఎవరు? మేం వారి కోసం సినిమా చేయడం లేదు. నిజానికి సగటు ప్రేక్షకులు ఓపెన్ మైండెడ్గానే ఉంటున్నారు. ఈ సమీక్షలు చేసేవాళ్లే మరీ లోతుగా వెళ్తున్నారు. ఈకాలంలో సోషల్ మీడియాను వాడుతున్న ప్రతి ఒక్కరూ సినిమా సమీక్షకులు అయిపోతున్నారు. వారి సొంత అభిప్రాయాలను సినిమాలపై రుద్దేస్తున్నారు.
నిష్పక్షపాతంగా సమీక్ష రాసేవాళ్లు చాలా తక్కువగా కనిపిస్తున్నారు. కొందరైతే సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావాలని వ్యక్తిగత విమర్శలకూ దిగుతున్నారు. ఇది ఏమాత్రం ఉపేక్షించదగిన విషయం కాదు” అంటూ సమీక్షకుల తీరుపై కనిక మండిపడ్డారు. కాజోల్, కృతి సనన్ కీలక పాత్రల్లో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రానికి కనిక కథను అందించడంతోపాటు నిర్మాతగానూ వ్యవహరించారు.