Renu Desai | సెలబ్రిటీలపైనే అంతా ఫోకస్ చేస్తుంటారు. వారి వ్యక్తిగత జీవితాల్లోకి తొంగి చూడటానికి ప్రయత్నిస్తుంటారు. అటువంటి వారికి హితవు చెప్పారు. సినీ నటి రేణూ దేశాయ్.. సినీ తారల వ్యక్తిగత జీవితాలపై వదంతులు స్రుష్టిస్తున్న పలువురు వ్యక్తులను ఉద్దేశిస్తూ సోషల్ మీడియాలో ఆమె సుదీర్ఘ పోస్ట్ పెట్టారు. ‘సెలబ్రిటీల జీవితాలపై దృష్టి పెట్టడం నిజమైన జర్నలిజం కాదు’ అని హితవు చెప్పారు. ‘టైగర్ నాగేశ్వరరావు’ సినిమాతో నటిగా సినిమా రంగంలోకి రేణూ దేశాయ్ పున:ప్రవేశం పట్ల ఒక వ్యక్తి ఇటీవల ఓ యూట్యూబ్’ చానెల్లో మాట్లాడుతూ.. ఆమె వ్యక్తిగత విషయాలపై కామెంట్లు చేశారు. ఆ వ్యక్తి పోస్ట్ చేసిన ఫొటోలను రేణూ దేశాయ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. ఆయనపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తన గత విజయాలను గుర్తు చేసిన రేణూ దేశాయ్.. మహిళలను తక్కువ చేసి చూడొద్దని హితవు చెప్పారు.
‘అందరిలాగే మేమూ మా వ్యక్తిగత జీవితాల్లో కొన్ని తప్పులు చేస్తాం. మా పర్సనల్ లైఫ్‌లో సమస్యలు ఉన్నాయి. ఇతరుల నుంచి ప్రేమ పొందిన మధుర క్షణాలతోపాటు కొన్ని తప్పుల వల్ల, ఎదురైన సమస్యల వల్ల మా మనస్సు ముక్కలైన సందర్భాలు ఉన్నాయి. ఇటువంటప్పుడు మేం మా వ్యక్తిగత జీవితంలో విడాకులు తీసుకోవడం నేరమేం కాదు. నా జీవితంపై నేను మాట్లాడటం నా ఇష్టం. ఇతరులకు ఎదురైన సమస్యలపై మాట్లాడి డబ్బు సంపాదించడం మంచిది కాదు’ అని రేణూ దేశాయ్ పేర్కొన్నారు.
‘నటీ నటులు, వారి వ్యక్తిగత జీవితాలపై మాట్లాడటం సమంజసమా? సమాజం, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తుందా? ఏదైనా సినిమా విడుదలైనప్పుడు దానిపై సినీ విశ్లేషకులు, విమర్శకులు తమ అభిప్రాయం వెల్లడిస్తారు. దాన్ని వారి భావ ప్రకటనా స్వేచ్ఛగా మేం భావిస్తాం. కానీ మా జీవితాల గురించి మాట్లాడటం మంచిది కాదు’ అని పేర్కొన్నారు. ఇటీవల ఖాళీగా ఉన్న ప్రతి ఒక్కరూ యూట్యూబ్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ ప్లాట్‌ఫామ్‌లపై సినీ ప్రముఖుల వ్యక్తిగత జీవితాల విషయమై మాట్లాడుకోవడం సాధారణమైందని రేణూ దేశాయ్ మండి పడ్డారు.