‘ఎన్టీఆర్ ఓ శక్తిస్వరూపం. ఆయన స్మారక చిహ్నం (ఎన్టీఆర్ ఘాట్) వద్ద ఇటీవల నా సినిమా ప్రారంభోత్సవాన్ని జరుపుకోవడం అనిర్వచనీయమైన అనుభూతినిచ్చింది. ఆ ప్రదేశాన్ని నేను ఓ పుణ్యక్షేత్రంగా భావిస్తా. అక్కడకు వెళితే ఏదో తెలియని శక్తిని పొందుతాం’ అన్నారు ప్రముఖ దర్శకుడు వై.వి.యస్.చౌదరి. నేడు విశ్వవిఖ్యాత నటుడు నందమూరి తారక రామారావు 103వ జయంతి. ఈ సందర్భంగా వై.వి.యస్.చౌదరి ‘నమస్తే తెలంగాణ’తో మాట్లాడుతూ దివంగత ఎన్టీఆర్ తాలూకు స్మృతుల్ని గుర్తుచేసుకున్నారు. ఎన్టీఆర్ తెలుగు జాతికి స్ఫూర్తినిచ్చారని, కోట్ల మంది జీవితాల్ని ప్రభావితం చేశారని, మన జీవన ప్రయాణంలో చూసిన మహామనిషి ఎన్టీఆర్ అని కొనియాడారు.
తాను ఎన్టీఆర్ అభిమానిగా మారిన వైనం గురించి చెబుతూ ‘మా అమ్మనాన్న యలమంచిలి రత్నకుమారి, యలమంచిలి నారాయణరావు ఇద్దరూ నాగేశ్వరరావు అభిమానులు. అయితే మా అన్నయ్య సాంబశివరావు మాత్రం ఎన్టీఆర్ వీరాభిమాని. ఆయన నన్ను ఎన్టీఆర్ సినిమాలకు తీసుకెళ్లేవారు. అలా నేను ఎన్టీఆర్ అభిమానినయ్యాను. ఆయన జీవన విధానం, సిద్ధాంతాల పట్ల ఆకర్షితుడనయ్యాను. ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడవటం వల్లే దర్శకుడిగా ఈ స్థాయికి చేరుకున్నా. ఎన్టీఆర్ అభిమాని కావడం ఓ వరం, అదృష్టం’ అన్నారు. సినీరంగంలోకి వచ్చిన తర్వాత ఎన్టీఆర్తో ఉన్న అనుబంధం గురించి మాట్లాడుతూ ‘నేను ఇండస్ట్రీలోకి వచ్చిన సమయంలో ఎన్టీఆర్ రాజకీయాల్లో బిజీగా ఉన్నారు. నేను అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ని. ప్రచారానికి సంబంధించిన యాడ్స్ షూట్లో ఎన్టీఆర్పై క్లాప్కొట్టిన సందర్భాలున్నాయి. నా దస్తూరి అంటే ఎన్టీఆర్కు చాలా ఇష్టం. నా చేతిరాతను ఆయన మెచ్చుకున్నారు కూడా’ అని వై.వి.యస్.చౌదరి తెలిపారు.