Committee Kurrollu | ‘విడుదలైన అన్ని కేంద్రాల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రానికి అద్భుతమైన స్పందన లభిస్తున్నది. సినిమాలో చర్చించిన పాయింట్ అందరికి కనెక్ట్ అయింది. ఇలాంటి సినిమా తీసినందుకు చాలా గర్వంగా ఉంది’ అని చెప్పింది నిహారిక కొణిదెల. ఆమె సమర్పణలో పింక్ ఎలిఫెంట్, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ పతాకాలపై యదువంశీ దర్శకత్వంలో రూపొందిన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రం ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది.
ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన విజయోత్సవ వేడుకలో నిహారిక కొణిదెల మాట్లాడుతూ ‘ఈ కథ విన్నప్పుడు తప్పకుండా గొప్ప చిత్రమవుతుందనే నమ్మకం కలిగింది. కొత్తవారైనా నటీనటులందరూ అద్భుతంగా పర్ఫార్మ్ చేశారు’ అని చెప్పింది. నాలుగేళ్ల కష్టానికి ఈ విజయంతో ప్రతిఫలం లభించిందని, సినిమాలో ప్రతీ పాత్రకు ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారని, మూడు తరాలను తెరపై చూపించడం ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తున్నదని దర్శకుడు యదువంశీ అన్నారు. మంచి కంటెంట్‌కు లభించిన ఆదరణ ఇదని నిర్మాత జయ అడపాక పేర్కొంది. ఈ వేడుకలో చిత్ర యూనిట్ మొత్తం పాల్గొంది.