Vignesh Shivan | లేడీ సూపర్ స్టార్ నయనతార (Nayanthara), ఆమె భర్త విఘ్నేశ్ శివన్ (Vignesh Shivan) ఇటీవలే తరచూ వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. అందుకు ప్రధాన కారణం తమిళ స్టార్ ధనుష్‌తో వివాదమే. ఇక ఇప్పుడు విఘ్నేశ్ గురించి ఓ వార్త తెగ ప్రచారం జరుగుతోంది. ఆయన పుదుచ్చేరి (Puducherry)లో ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు (government property) చేస్తున్నట్లు సోషల్ మీడియాలో తెగ ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై విఘ్నేశ్ తాజాగా స్పందించారు.
విఘ్నేశ్ శివన్ ఇటీవలే పుదుచ్చేరి వెళ్లి అక్కడి పర్యాటక శాఖ మంత్రిని కలిసిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని ఆయనే సోషల్ మీడియా వేదికగా స్వయంగా ప్రకటించారు. దీంతో ఆయన పుదుచ్చేరిలో ప్రభుత్వ ఆస్తిని కొనుగోలు చేస్తున్నారంటూ వార్తలు వచ్చాయి. అందుకోసమే పర్యాటక శాఖ మంత్రిని కలిశారంటూ ప్రచారం జరిగింది. దీనిపై విఘ్నేశ్ క్లారిటీ ఇచ్చారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
‘నేను పుదుచ్చేరిలో ప్రభుత్వ ఆస్తులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై నేను క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నాను. నేను నా తదుపరి చిత్రం షూటింగ్ చేసుకునేందుకు అనుమతి కోసం అక్కడికి వెళ్లాను. ఆ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రిని, పర్యాటక శాఖ మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశాను. అప్పుడు స్థానిక మేనేజర్ కూడా నాతోనే ఉన్నారు. నా మీటింగ్ అయిన తర్వాత ఆయన (లోకల్ మేనేజర్) ఆస్తుల కొనుగోలు విషయమై అక్కడి సిబ్బందితో చర్చించారు. దీంతో అది నాకోసమే అని అంతా పొరబడ్డారు. ఈ విషయంతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని ఇన్‌స్టా వేదికగా ఓ పోస్టులో క్లారిటీ ఇచ్చారు.
విఘ్నేశ్ దర్శకత్వంలో వస్తున్న తాజా చిత్రం ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’. ప్రదీప్ రంగనాథన్, కృతిశెట్టి హీరోహీరోయిన్లు. ఎస్.జె.సూర్య, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్, 7 స్క్రీన్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Akhil Akkineni | సీమ బ్యాక్‌డ్రాప్ లవ్‌స్టోరీతో అఖిల్ అక్కినేని కొత్త సినిమా.. వివరాలివే..!
Venu Swamy | అల్లు అర్జున్ సీఎం అవుతాడు : వేణు స్వామి
Prabhas injured | సినిమా షూటింగ్లో ప్రభాస్‌కు గాయం.!