దర్శకుడిగా ఎందరికో స్ఫూర్తినిచ్చారు రాజమౌళి. మరి ఆయనకు స్ఫూర్తినిచ్చింది ఎవరు? అనే విషయం మాత్రం చాలామందికి తెలియదు. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు ప్రభావం తనపై ఉందని పలు సందర్భాల్లో రాజమౌళి చెప్పారు. అలాగే ఆయన్ని ప్రభావితం చేసిన దర్శకుడు వేరొకరున్నారు. ఆయనే విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీరామారావు. ఇటీవల ఓ టాక్‌షోలో ఈ విషయాన్ని వెల్లడించారు రాజమౌళి. ‘సినీ దర్శకుడిగా నేను ఎక్కడినుంచి స్ఫూర్తి పొందానో చెప్పడం కష్టం.
చిన్నప్పట్నుంచీ చదివిన పుస్తకాలు, చూసిన సినిమాలు, కుటుంబంలోని వ్యక్తులతో జరిగిన చర్చలు. ఇవన్నీ లావాగా మారి నాలోని సృజనను రగిలించి ఉండొచ్చు. ముఖ్యంగా నేను నందమూరి తారక రామారావుగారి వీరాభిమానిని. ఆయన సినిమాలు చిన్నప్పట్నుంచీ ఎక్కువగా చూసేవాడ్ని. అందరికీ ఆయన మహానటుడిగానే ఎక్కువగా తెలుసు. కానీ ఆయన మహా దర్శకుడు కూడా. తనకు తెలిసిన విషయాన్ని జనం మెచ్చేలా మార్చగలననే నమ్మకం ఆయన దర్శకత్వంలో పుష్కలంగా కనిపిస్తుంది. అందుకే దర్శకుడిగా క్లాసిక్స్ తీశారు. ఆయన ప్రభావం కూడా నాపై ఉంది’ అని తెలిపారు.