‘దర్శకుడ్ని కావాలనేది నా చిన్ననాటి కల. అందుకే చిన్న వయసులోనే చెన్నై రైలెక్కాను. ఎన్నో ఆటుపోటుల్ని ఎదుర్కొన్నాను. చివరకు ‘నీ కోసం’తో దర్శకుడ్ని అయ్యాను. ఆ సినిమా వచ్చి పాతికేళ్లు అయ్యిందంటే నమ్మలేక పోతున్నాను. ఆనాడు డైరెక్టర్ని అవ్వడమే నా లక్ష్యం. కానీ.. పాతికేళ్లు దర్శకుడిగా ఉంటానని మాత్రం అస్సలు అనుకోలేదు. నేను ఊహించని ఎన్నో అద్భుతాలు నా కెరీర్లో జరిగాయి.
ఈ అందమైన ప్రయాణానికి కారకులైన ప్రేక్షకులకు, నిర్మాతలకు, నా హీరోలకు థాంక్స్ చెప్పుకుంటున్నా’ అని దర్శకుడు శ్రీను వైట్ల అన్నారు. ఆయన తొలి సినిమా ‘నీ కోసం’ విడుదలై పాతికేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా శ్రీనువైట్ల విలేకరులతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘నా తొలి సినిమా ‘నీకోసం’కి ముందు ఓ సినిమా మొదలై ఆగిపోయింది.
నిరుత్సాహానికి లోనయ్యాను. రవితేజ నా ఫ్రెండ్. నా టాలెంట్‌పై అతనికి చాలా నమ్మకం. తన ప్రోత్సాహంతో ఓ కథ రాశాను. చిన్న బడ్జెట్లో చేయాలనుకున్నా. కొందరు కొత్త నిర్మాతలు వచ్చారు. అలా ‘నీ కోసం’ మొదలైంది. కానీ మధ్యలోనే ఆగిపోయింది. రవితేజ ప్రోత్సాహంతో ఎలాగొలా పూర్తి చేశాను. రామోజీరావుగారికి సినిమా నచ్చి, మంచి రేటుకు కొనేసి రిలీజ్ చేశారు.
ఆ సినిమా బాగా ఆడటంతోపాటు ఏడు నంది అవార్డులను గెలుచుకుంది. ఆ తర్వాత రామోజీరావుగారు తమ సంస్థలో నాకు డైరెక్షన్ ఆఫర్ ఇచ్చారు. అదే ‘ఆనందం’. అప్పట్లో నాగార్జున కూడా ‘నీకోసం’ చూసి నన్ను అభినందించారు.’ అంటూ గుర్తు చేసుకున్నారు శ్రీనువైట్ల. త్వరలో ఓ కొత్త సబ్జెక్ట్‌తో రాబోతున్నానని, వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని శ్రీనువైట్ల తెలిపారు.