Tamil film director Shankar | తమిళ దిగ్గజ దర్శకుడు శంకర్‌కి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాక్ ఇచ్చిన విషయం తెలిసిందే. 2010లో శంకర్ దర్శకత్వంలో వచ్చి విడుదలైన రోబో(తమిళంలో ఎంథిరన్) సినిమా కాపీ రైట్ విషయంలో మానీలాండరింగ్ కింద శంకర్‌కి చెందిన రూ.10 కోట్లకు పైగా విలువైన మూడు స్థిరాస్తులను ఈడీ జప్తు చేసింది. అయితే ఈడీ తీసుకున్న చర్యలపై శంకర్ తాజాగా స్పందించాడు.
చెన్నై జోనల్ కార్యాలయం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తీసుకున్న ఒక చర్యను ప్రజల దృష్టికి తీసుకురావాలని కోరుకుంటున్నాను. నా ఎంథిరన్ (రోబో) సినిమాకు సంబంధించి నిరాధారమైన కాపీరైట్ ఆరోపణలను చూపించి నాకు సంబంధించిన మూడు స్థిరాస్తులను తాత్కాలికంగా జప్తు చేశారు. ఈ జప్తు గురించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఇప్పటివరకు ఎలాంటి సమాచారం రాలేదు. అలాగే ఈ చర్యల వలన చట్టపరమైన వాస్తవాలను తప్పుగా అర్థం చేసుకోవడమే కాకుండా, చట్టపరమైన ప్రక్రియను స్పష్టంగా దుర్వినియోగం చేయడాన్ని సూచిస్తుంది.
ఎంథిరన్ సినిమాకు సంబంధించి ఇప్పటికే హైకోర్టు క్షుణ్ణంగా విచారణ జరిపి తీర్పునిచ్చిన విషయాన్ని హైలైట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కోర్టు ఇరువైపుల నుంచి సాక్ష్యాలు మరియు వాదనలను జాగ్రత్తగా పరిశీలించి, ఎంతిరన్ కథకు నిజమైన కాపీరైట్ హోల్డర్‌గా గుర్తించాలని కోరిన ఆరూర్ తమిళ్ నాదన్ దాఖలు చేసిన దావాను కొట్టివేసింది అని గుర్తు చేస్తున్నాను. అలాగే ఈ కేసుపై ఇప్పటికే న్యాయస్థానం బాధ్యతాయుతమైన తీర్పును ఇచ్చినప్పటికి దానిని పట్టించుకోకుండా ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (FTII) ఇచ్చిన నివేదిక ఆధారంగా తన ఆస్తులను ఈడీ జప్తు చేసిందని శంకర్ తెలిపారు. కాపీరైట్ ఉల్లంఘన జరగలేదని కోర్టు స్పష్టంగా చెప్పినప్పటికీ.. ఈడీ యొక్క చర్యలు నన్ను ఎంతగానో బాధించాయి అంటూ శంకర్ వెల్లడించాడు.
అసలు ఏం జరిగిందంటే..
తమిళనాడుకి చెందిన అరూర్ తమిళనాథన్ అనే వ్యక్తి తన జిగుబా పుస్తకంలోని కథను కాపీ కొట్టి శంకర్ రోబో తెరకెక్కించినట్లు 2011లో ఎగ్మోర్ కోర్ట్‌లో పిటిషన్ దాఖలు చేశాడు. 1957 కాపీరైట్ యాక్ట్ ఉల్లంఘించిన నేపథ్యంలో శంకర్‌పై చర్యలు తీసుకోవాలని పిటిషన్లో తమిళనాథన్ పేర్కొన్నాడు.
అయితే ఈ పిటిషన్‌పై ఎగ్మోర్ కోర్ట్ తాజాగా విచారణ చేప్పట్టింది. ఈ కేసు విషయంలోనే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా -FTII నివేదిక కూడా శంకర్ వ్యతిరేకంగా రావడంతో పాటు జిగుబా కథ రోబో సినిమాకి దగ్గర పోలికలున్నాయని తెలిపింది. దీంతో శంకర్ కాపీరైట్లోని సెక్షన్ 63ను ఉల్లంఘించినట్టు ఈడీ స్పష్టం చేసింది. అలాగే రోబో సినిమాకు పారితోషకంగా 11.5 కోట్ల రూపాయలను శంకర్ అందుకున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ నేపథ్యంలోనే మనీలాండరింగ్ నిరోధక చట్టం ప్రకారం ఫిబ్రవరి 17న ఆస్తులను జప్తు చేసినట్లు ఈడీ వెల్లడించింది.