నలభై ఏండ్ల సినీ కెరీర్లో వంద సినిమాల మైలురాయికి చేరువయ్యారు అగ్రనటుడు నాగార్జున. ఈ ప్రయాణంలో ఎన్నో అపూర్వ విజయాలు ఉన్నాయి. ఎవరికీ సాధ్యంకాని రీతిలో క్లాసిక్ చిత్రాలకు చిరునామాగా నిలిచారు. ప్రయోగాలు, పాన్ ఇండియా ట్రెండ్ అనే మాటలు అంతగా వినిపించని రోజుల్లోనే ఆ దిశగా అడుగులు వేసి విజయాలు దక్కించుకున్నారు. ఆయన ధనుష్‌తో కలిసి నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’ నేడు ప్రేక్షకుల ముందుకురానుంది. శేఖర్‌కమ్ముల దర్శకుడు. ఈ సందర్భంగా నాగార్జున పంచుకున్న విశేషాలు..
నేను సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉంటాను. ఫేస్బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో ఎలాంటి ఖాతాలు లేవు. ట్విట్టర్లో ఎప్పుడో ఒక పోస్ట్ పెడతాను. మళ్లీ దానివైపు కూడా చూడను. సోషల్ మీడియా తాలూకు ఫేక్, పెయిడ్ పబ్లిసిటీని నేను నమ్మను. సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంటున్నా కాబట్టే మనసు హాయిగా ఉంది (నవ్వుతూ). నా దృష్టిలో సోషల్ మీడియా అన్నది పెద్ద భూతం. ఫేస్బుక్లో నా అఫీషియల్ అకౌంట్ టిక్ మార్క్‌తో ఫ్యాన్స్ ఓ పేజీని నడుపుతున్నారు.
నా దృష్టిలో పెద్ద సినిమా అని ప్రత్యేకంగా ఏమీ ఉండదు. ఇప్పుడు అన్నిటికంటే కథే పెద్దది. అలాగే రికార్డులు కూడా శాశ్వతం కాదు. అవి బ్రేక్ అవుతూనే ఉంటాయి. పెద్ద సినిమాలు ఎన్నో ఫ్లాప్ అయిన సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి విషయాలను నేను పెద్దగా పట్టించుకోను. మంచి పాత్రలపైనే దృష్టి పెడుతున్నా. రేప్పొద్దున ఎవరైనా దర్శకుడు అద్భుతమైన కథ చెబితే కమెడియన్ రోల్ చేయడానికి కూడా వెనుకాడను.
మల్టీస్టారర్స్ మీకు కొత్తేమీ కాదు. కానీ, చాలా విరామం తర్వాత ‘కుబేర’ వంటి మల్టీస్టారర్ చేయడం ఎలా అనిపించింది?
కొత్త కథలు రావాలంటే హీరోలు కలిసి పనిచేయాల్సిందే. ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉంది. నాన్నతోపాటు ఎన్టీఆర్, కృష్ణ, శోభన్‌బాబు లాంటివారు ఎన్నో మల్టీస్టారర్స్‌లో భాగమయ్యారు. ఇక ‘కుబేర’ విషయానికొస్తే.. శేఖర్ కమ్ములతో ఎప్పటినుంచో పనిచేయాలనుకుంటున్నా. ‘ఆనంద్’ నుంచి ఆయన సినిమాలంటే చాలా ఇష్టం. ‘కుబేర’ కథ చెప్పినప్పుడు బాగా నచ్చింది. ఇలాంటి కథలు ఈ తరానికి చెప్పాల్సిన అవసరం ఉందనిపించింది.
‘కుబేర’ సోషల్ డ్రామా కదా.. కమర్షియల్ ఎలిమెంట్స్‌కు స్కోప్ తక్కువగా ఉంటుందనే భావన ఎప్పుడైనా కలిగిందా?
అలాంటిదేమీ లేదు. ‘కుబేర’ పక్కా కమర్షియల్ సినిమా. శేఖర్ కమ్ముల కథలన్నీ సెన్సిబుల్, సోషల్ రిలవెంట్గా ఉంటాయి. వాటిలో కావాల్సినంత కమర్షియల్ హంగులూ కనిపిస్తాయి. ‘లవ్‌స్టోరీ’ సినిమాను తీసుకుంటే..ఆ కథలో ఓ ఇష్యూని చర్చిస్తూనే అద్భుతమైన పాటలతో సినిమాను కలర్ఫుల్గా ప్రజెంట్ చేశాడు. ‘కుబేర’ కూడా సామాజిక అంశాలతో ముడిపడిన కమర్షియల్ కథే!
‘కుబేర’ కథలో మీకు నచ్చిన అంశాలు..?
సమాజంలోని ఆర్థిక అంతరాలను చర్చించే కథ ఇది. సంపన్నులు, మధ్యతరగతి వర్గం, దారిద్య్రరేఖకు దిగువన ఉండే పేదలు.. ఈ మూడు ప్రపంచాలను, వాటి మధ్య సంఘర్షణను చూపిస్తుంది. నేటి సమాజానికి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను సీబీఐ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తా. అతను మంచి, చెడుల మధ్య ఊగిసలాడుతూ ఉంటాడు. తనో మధ్యతరగతి వ్యక్తి. నా క్యారెక్టర్లో డిఫరెంట్ షేడ్స్ ఉంటాయి.
శేఖర్ కమ్ముల అద్భుతంగా డిజైన్ చేశారు. సెటిల్డ్ పెర్ఫార్మెన్స్కు మంచి స్కోప్ ఉన్న పాత్ర చేయడం సంతృప్తిని ఇచ్చింది.
సాధారణంగా అభిమానులు తమ హీరోలను ఫుల్‌లెంగ్త్ పాత్రల్లోనే చూడాలనుకుంటారు. మీరేమో ఇతర హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నారు. ఈ విషయంలో ఫ్యాన్స్‌కు మీరేం చెబుతారు?
కథలు నచ్చాయి కాబట్టి క్యారెక్టర్స్ చేస్తున్నా. నటుడిగా ఒకే పరిధికి పరిమితమైపోవద్దు. అన్ని రకాల పాత్రలు చేయాలి. న్యూ ఏజ్ డైరెక్టర్స్ అద్భుతమైన కంటెంట్‌తో వస్తున్నారు. అలాంటివారిని ఎంకరేజ్ చేయాలి. క్యారెక్టర్ రోల్స్‌తోపాటు సోలో హీరోగా కొన్ని సినిమాలు లైనప్‌లో ఉన్నాయి.
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో అమల, నాగచైతన్య నటించారు. ఇప్పుడు మీ వంతు. ఈ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది?
శేఖర్ కమ్ములతో నాగచైతన్య ‘లవ్‌స్టోరీ’ చేశాడు. ఆ సినిమా నాకు కూడా బాగా నచ్చింది. శేఖర్ గురించి నాగచైతన్య చాలా మంచి విషయాలు చెప్పాడు. ‘మీరు ఆయన వర్క్‌ని తప్పకుండా ఇష్టపడతారు నాన్న.. షూటింగ్‌ను బాగా ఎంజాయ్ చేస్తారు’ అని చైతూ అన్నాడు.
త్వరలో 100వ చిత్రాన్ని చేయబోతున్నారు. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడు మొదలుపెట్టబోతున్నారు?
తమిళ దర్శకుడు కార్తీక్ నా వందో చిత్రాన్ని డైరెక్ట్ చేయబోతున్నాడు. త్వరలో అనౌన్స్‌మెంట్‌తోపాటు సినిమాకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తాం. ‘కింగ్ 100’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టాం.
‘కుబేర’లో మీ క్యారెక్టర్‌ను తీర్చిదిద్దిన విధానం ఎలా ఉంటుంది?
నా బాడీలాంగ్వేజ్, మాట్లాడే విధానం, ప్రత్యర్థులకు కౌంటర్ ఇచ్చే తీరు చాలా కొత్తగా అనిపిస్తాయి. నా క్యారెక్టర్లో ఆల్ షేడ్స్ కనిపిస్తాయి (నవ్వుతూ). శేఖర్ నా పాత్రను చాలా గొప్పగా డిజైన్ చేశాడు. కథలోనే కొత్త పాయింట్ ఉంది కాబట్టి ప్రతి క్యారెక్టర్‌తో ప్రేక్షకులు సులభంగా కనెక్ట్ అవుతారు. రష్మిక మందన్న పాత్ర సర్ప్రైజింగ్గా అనిపిస్తుంది. ‘ఈ సినిమాకు నువ్వే స్టార్’ అని తనతో చెప్పాను.
‘కూలీ’ చిత్రంలో విలన్‌గా నటిస్తున్నారు కదా.. ఆ ఎక్స్పీరియన్స్ గురించి?
పూర్తిస్థాయి విలన్ పాత్ర అది. దర్శకుడు లోకేశ్ కనకరాజ్ నా పాత్రను ైస్టెలిష్‌గా డిజైన్ చేశారు. నా క్యారెక్టర్లో కొత్తదనంతోపాటు పెద్ద స్పాన్ ఉన్న సినిమా కాబట్టి విలన్‌గా నటిస్తున్నా. అంతమాత్రాన భవిష్యత్తులో కూడా ఇక విలన్ పాత్రలే చేస్తానని అనుకోవద్దు (నవ్వుతూ).
– సినిమా డెస్క్