‘భీమదేవరపల్లి బ్రాంచి’ చిత్రం ద్వారా ప్రతిభావంతుడైన దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు రమేష్ చెప్పాల. తెలంగాణ నేపథ్య కథాంశంతో ఆయన తెరకెక్కించిన తాజా చిత్రం ‘లగ్గం’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. సుబిషి ఎంటర్టైన్మెంట్ పతాకంపై వేణుగోపాల రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా దర్శకుడు రమేష్ చెప్పాల ‘నమస్తే తెలంగాణ’తో చిత్ర విశేషాలను పంచుకున్నారు.
తెలంగాణ సంస్కృతిలో లగ్గం చాలా ప్రత్యేకతలతో కూడుకొని ఉంటుంది. పెళ్లి చుట్టూ అల్లుకున్న భావోద్వేగాలు, సరదా సంగతులను అందమైన దృశ్యరూపంగా తెరపై తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఈ సినిమా తీశా. చిన్నతనం నుంచి నేను చూసిన వ్యక్తులు, ఎదుర్కొన్న అనుభవాలతో ఈ కథ రాశాను. ‘లగ్గం’ అనే టైటిల్ అనుకోగానే అద్భుతమైన స్పందన లభించింది.
బావామరదళ్ల పెళ్లి నేపథ్యంలో కథ నడుస్తుంది. తన కూతురుని సాఫ్ట్వేర్ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తే బాగుంటుందని తపించే తండ్రి చివరకు ఏ నిర్ణయం తీసుకున్నాడనేది కథలో ఆసక్తికరంగా ఉంటుంది. పెళ్లిచూపులు మొదలుకొని అప్పగింతల వరకు తెలంగాణ లగ్గంలో జరిగే ఎన్నో మధుర ఘట్టాలను ఆవిష్కరిస్తూ పొయొటిక్ ఫీల్‌తో ఈ సినిమా సాగుతుంది. ప్రతీ ఆడపిల్ల తండ్రి తప్పక చూడాల్సిన సినిమా ఇది.
ైక్లెమాక్స్ ఘట్టాలు హృదయాన్ని స్పృశించే భావోద్వేగాలతో సాగుతాయి. ప్రేక్షకులకు గొప్ప సత్యాన్ని తెలియజేస్తూ కథ ముగుస్తుంది. మన ఇంట్లో జరిగిన లగ్గాన్ని యాదికి తెస్తూ ఎన్నో అందమైన జ్ఞాపకాలను గుర్తుకు తెస్తుంది. ఈ లగ్గానికి విచ్చేసే ప్రేక్షకులందరూ నా బంధువులే. అందరూ సినిమాకు విచ్చేసి మీ ఆశీస్సులు అందించాలని కోరుకుంటున్నా