‘మల్లేశం’ ‘8ఏమ్ మెట్రో’ చిత్రాలతో రియలిస్టిక్ ఫిల్మ్ మేకర్‌గా ప్రశంసలందుకున్నారు దర్శకుడు రాజ్ ఆర్. ఆయన రూపొందించిన తాజా చిత్రం ‘23’. తేజ, తన్మయి ప్రధాన పాత్రల్లో నటించారు. శనివారం టీజర్‌ను విడుదల చేశారు. 1991 చుండూరు ఊచకోత, 1993 చిలకలూరిపేట బస్సు దహనం, 1997 జాబ్లీహిల్స్ కారు బాంబు పేలుడు ఘటనల నేపథ్యంలో టీజర్ ఉత్కంఠగా సాగింది.
ఈ సందర్భంగా దర్శకుడు రాజ్ ఆర్ మాట్లాడుతూ ‘టీజర్లో చూపించిన మూడు మారణహోమాల్లో మొత్తం 23 మంది చనిపోయారు. అందుకే అదే టైటిల్ పెట్టాం. మానవ హక్కుల నేపథ్యంలో నడిచే కథ ఇది. న్యాయం దొరకని బాధితుల పక్షం వహిస్తుంది. మూడు ఘటనల్లో చాలా మంది చనిపోయారు.
చంపిన వారందరికి సమానంగా శిక్ష పడిందా? అన్నదే అసలు ప్రశ్న. నేను ఎంతగానో కనెక్ట్ అయిన ఈ కథను ప్రేక్షకులకు చెప్పాలనుకున్నా’ అన్నారు. నిజజీవిత ఘటనల్ని నిజాయితీగా చూపించారని, చరిత్రలో నిలిచిపోయే సినిమా ఇదని నటి ఝాన్సీ పేర్కొన్నారు. ఈ సినిమాను రానా స్పిరిట్ మీడియా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నది. ఈ చిత్రానికి సంగీతం: మార్క్ కె రాబిన్, సంభాషణలు: ఇండస్ మార్టిన్, దర్శకత్వం: రాజ్ ఆర్.