విజయ్ దేవరకొండ చేయనున్న చిత్రాల్లో రాహుల్ సంకృత్యాన్ సినిమా ఒకటి. మైత్రీ మూవీమేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. ట్యాక్సీవాలా, శ్యామ్‌సింగరాయ్ సినిమాలతో దర్శకుడిగా తనేంటో నిరూపించుకున్నారు రాహుల్ సంకృత్యాన్. విజయ్‌తో చేయనున్న సినిమాకి కూడా వైవిధ్యమైన కథనే ఎంచుకున్నారాయన. ఇది పీరియాడికల్ యాక్షన్ డ్రామా అని తెలుస్తున్నది. అయితే.. ఈ కథ విషయంలో ఆసక్తికరమైన విషయం ఒకటి వెలుగు చూసింది.
రాహుల్ ఈ కథను విజయ్ కంటే ముందు తమిళ హీరో సూర్యకి వినిపించారు. సూర్య, కార్తీ తండ్రీకొడుకులుగా మల్టీస్టారర్ చేయాలనేది ఆయన ఆలోచన. వారికి కూడా ఈ కథ నచ్చింది. కానీ కొన్ని కారణాలవల్ల కథ పట్టాలెక్కలేదు. చివరకు ఆ కథ విజయ్ దేవరకొండ కోర్ట్లోకి వచ్చి పడింది. విజయ్ ఇమేజ్‌కి తగ్గట్టు కథలో కొన్ని మార్పులు కూడా జరిగాయని సమాచారం. ఈ సినిమాలో తండ్రీకొడుకులుగా రెండు పాత్రలూ విజయే పోషించనున్నారు. కథానాయికగా రష్మిక ఖరారైంది. విజయ్-రష్మిక కాంబోలో వస్తున్న మూడో సినిమా ఇది.