గత ఏడాది సంక్రాంతికి వచ్చిన ‘నా సామిరంగ’ తర్వాత అగ్రహీరో అక్కినేని నాగార్జున నుంచి సినిమా రాలేదు. ప్రస్తుతం ఆయన ధనుష్ ‘కుబేర’, రజనీకాంత్ ‘కూలీ’ చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలు త్వరలో విడుదల కానున్నాయి. అయితే.. సోలో హీరోగా ఆయన చేసే సినిమా కోసం అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. నాగ్ కూడా ప్రసుతం కథలు వినే పనిలోనే ఉన్నారని తెలుస్తున్నది. ఇదిలావుంటే.. రీసెంట్గా నాగ్‌కి డైరెక్టర్ పూరీ జగన్నాథ్ ఓ కథ వినిపించారట. నాగార్జునకు కూడా ఆ కథ బాగా నచ్చిందని సమాచారం. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో ‘శివమణి’, ‘సూపర్’ సినిమాలు వచ్చాయి. వాటిలో ‘శివమణి’ బాగా ఆడింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలవనున్నారని ఫిల్మ్ వర్గాల సమాచారం. ప్రసుతం పూరీకి హిట్ వాంటెడ్. మరి నాగార్జున కోసం ఆయన ఏ తరహా కథ రెడీ చేశారో.. ఈ సినిమాను ఏ నిర్మాత నిర్మిస్తాడో, అసలు ఇందులో వాస్తవాలెన్నో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.