Prabhas | ప్రభాస్ హీరోగా ప్రశాంత్‌వర్మ దర్శకత్వం సినిమా.. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వినపడుతున్నది. ఇందులో నిజం ఎంత? అనే విషయానికొస్తే.. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో అరడజను సినిమాలున్నాయి. వాటిల్లో రాజాసాబ్, ఫౌజీ(టైటిల్ పరిశీలనలో ఉంది) చిత్రాలు షూటింగ్ దశలో ఉన్నాయి. కల్కి-2, స్పిరిట్ చిత్రాలు ప్రీప్రొడక్షన్ దశలో ఉన్నాయి.
‘సలార్-2’ చిత్రానికి ఇంకా టైమ్ ఉంది. ఇవిగాక ఇంకొన్ని కమిట్మెంట్లు పైప్ లైన్లో ఉన్నాయి. ప్రస్తుతం ప్రభాస్ అంత బిజీగా ఉన్నారు. ఇక ప్రశాంత్‌వర్మ విషయానికొస్తే.. నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తొలి చిత్రాన్ని డైరెక్ట్ చేసే పెద్ద బాధ్యతను భుజానికెత్తుకున్నారాయన.
మరోవైపు ‘జై హనుమాన్’ ఎలాగూ ఉంది. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తవ్వాలంటే.. ప్రభాస్‌కు ఓ ఐదేళ్లు, ప్రశాంత్‌వర్మకు ఓ రెండేళ్లు పట్టక తప్పదు. ఇక అసలు విషయానికొస్తే.. ప్రశాంత్వర్మతో పని చేసేందుకు ప్రభాస్ ఓకే చెప్పిన మాట నిజమే అని సమాచారం. అయితే.. అది కార్యరూపం దాల్చడానికి కొన్నేళ్లు పడుతుంది. అంతేకాదు, కాలం కూడా కలిసిరావాలి. అదన్నమాట అసలు విషయం.