‘కాలాన్ని బట్టి మనుషుల ఆలోచనా ధోరణుల్లో మార్పు వస్తుంటుంది. మంచి నిర్ణయాలు తీసుకొని జీవితంలో సంతోషంగా బతకాలనే అంశాన్ని ఈ సినిమాలో చర్చించాం. ఏదో కాలక్షేపం కోసం ఈ సినిమా చేయలేదు. కథలో బలమైన భావోద్వేగాలుంటాయి’ అన్నారు సీనియర్ నిర్మాత, దర్శకుడు ఎం.ఎస్.రాజు. ఆయన దర్శకత్వంలో నరేష్, పవిత్రాలోకేష్ జంటగా నటించిన ‘మళ్లీ పెళ్లి’ చిత్రం ఈ నెల 26న విడుదలకానుంది. ఈ సందర్భంగా శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఎం.ఎస్.రాజు పంచుకున్న విశేషాలు..
నరేష్‌గారి యాభై ఏళ్ల సినీ కెరీర్ ఆధారంగా సినిమా తీయాలనుకున్నా. కథ చెప్పగానే నరేష్, పవిత్రాలోకేష్ అంగీకరించారు. ఈ కథ విషయంలో ఎంత లోతుకైనా వెళ్లమని నాకు పూర్తి స్వేచ్ఛ నిచ్చారు. టీజర్, ట్రైలర్ చూస్తే నిజ జీవిత సంఘటనలు ఈ సినిమాలో ఉంటాయని అర్థమవుతుంది. అయితే అవి ఎంత మేరకు ఉంటాయన్నది సినిమా మొత్తం చూస్తేనే తెలుస్తుంది. ఈ కథలో అనుకోని మలుపులు, సంచలన అంశాలు ఉంటాయి. నేటి రోజుల్లో ప్రతి ఒక్కరూ వ్యక్తిగత స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. అదే కోణంలో ఈ కథ సాగుతుంది. మన సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తూనే పెళ్లి తాలూకు కొత్త కోణాల్ని చర్చిస్తుంది.
కొత్త కథలు చెప్పాలని..
నేను నిర్మాతగా తీసిన ఒక్కడు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా చిత్రాలు అప్పటి ట్రెండ్‌లో కొత్తవే. నేను దర్శకుడిగా మారడానికి చాలా కారణాలున్నాయి. ‘డర్టీ హరి’ చిత్రాన్ని చేయమని ఓ యువ దర్శకుణ్ణి అడిగితే అలాంటి బోల్డ్ కంటెంట్‌ను తాను డీల్ చేయలేనని చెప్పాడు. దాంతో నేనే దర్శకత్వం వహించా. సినిమా చూసిన వారికి అందులోని సందేశం బాగా నచ్చింది. ప్రేక్షకులకు కొత్త కథల్ని చెప్పాలనే లక్ష్యంతో దర్శకుడిగా మారాను. ‘మళ్లీ పెళ్లి’ చిత్రంలో మనుషుల్ని ఒంటరితనం ఎంతగా బాధిస్తుందో అనే అంశాన్ని నిజాయితీగా చూపించే ప్రయత్నం చేశాను. నరేష్, పవిత్రాలోకేష్ ఇద్దరూ గొప్ప నటులే. వారిద్దరు నటించడం వల్లే ఈ సినిమాపై హైప్ క్రియేట్ అయింది.