‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’ చిత్రం ద్వారా సీనియర్ రైటర్ మోహన్ దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. వెన్నెల కిషోర్ టైటిల్ రోల్లో నటించిన ఈ చిత్రం ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సందర్భంగా బుధవారం జరిగిన సమావేశంలో దర్శకుడు రైటర్ మోహన్ చిత్ర విశేషాలు తెలియజేస్తూ ‘ఏడు పాత్రల చుట్టూ ఈ కథ నడుస్తుంది. అందులో రైల్‌కి ఇంజన్‌లా వెన్నెల కిషోర్ పాత్ర ప్రధానంగా కనిపిస్తుంది. ఆయన పోషించిన డిటెక్టివ్ పాత్ర హాస్య ప్రధానంగా ఆకట్టుకుంటుంది. తెలంగాణకు చెందిన వెన్నెల కిషోర్ ఉత్తరాంధ్ర యాసను నేర్చుకొని ఈ సినిమా చేశారు. ఈ కథలో క్రైమ్, కామెడీ, ఎమోషనల్ ఎలిమెంట్స్ అన్నీ ఉంటాయి’ అని చెప్పారు.
1991లో జరిగే కథ ఇదని, రాజీవ్‌గాంధీ హత్యోదంతంతో షెర్లాక్‌హోమ్స్ అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌కు ఉన్న సంబంధం ఏంటన్నది ఆసక్తికరంగా ఉంటుందని, స్క్రీన్‌ప్లేను ఎవరూ ఊహించలేరని రైటన్ మోహన్ తెలిపారు. తెలుగులో డిటెక్టివ్ సినిమా అనగానే ‘చంటబ్బాయ్’ సినిమా గుర్తుకొస్తుందని, హాలీవుడ్ ఫిక్షనల్ క్యారెక్టర్ అయిన షెర్లాక్ హోమ్స్ అందరికి పరిచయం లేనందున ‘చంటబ్బాయ్ తాలూక’ అనే క్యాప్షన్‌తో టైటిల్ పెట్టామని ఆయన తెలిపారు. తాను ఈవీవీ సత్యనారాయణ, పోసాని కృష్ణమురళి దగ్గర రచయితగా శిష్యరికం చేశానని, ఆ తర్వాత రాజశేఖర్ సినిమాలకు పనిచేశానని, ఆయనే తనకు రైటర్ మోహన్ అనే పేరు పెట్టాడని పేర్కొన్నారు. రచయితగా కామెడీ తనకు పెద్దబలం అని, తదుపరి సినిమా కోసం స్క్రిప్ట్ సిద్ధంగా ఉందని రైటర్ మోహన్ తెలిపారు.