‘బార్బరికుడు త్రిబాణంతో కురుక్షేత్రాన్ని ఆపగలడు. అలాంటి బార్బరికుడ్ని కృష్ణుడు ఓ వరం అడిగి, కురుక్షేత్రం జరిగేలా చేస్తాడు. నార్త్‌లో బార్బరికుడికి ఫాలోయింగ్ ఎక్కువ. ఇందులో కొన్ని సన్నివేశాల్లో సత్యరాజ్ బార్బరికునిగా కనిపిస్తారు. మేకప్ విషయంలో ఆయన్ను చాలా కష్టపెట్టాను.’ అని డైరెక్టర్ మోహన్ శ్రీవత్స అన్నారు. ఆయన దర్శకత్వంలో సత్యరాజ్ ప్రధాన పాత్రధారిగా రూపొందిన చిత్రం ‘త్రిబాణధారి బార్బరిక్’. ఉదయభాను, వశిష్ట ఎన్.సింహా, సత్యంరాజేష్, క్రాంతి కిరణ్, సాంచీ రాయ్ కీలక పాత్రధారులు. విజయ్‌పాల్‌రెడ్డి అడిదెల నిర్మాత. ఈ నెల 29న సినిమా విడుదల కానుంది.
ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో దర్శకుడు మోహన్ శ్రీవత్స విలేకరులతో ముచ్చటించారు. ‘విజయ్ సేతుపతి ‘మహారాజా’ సినిమా స్క్రీన్‌ప్లే, టెంప్లెట్లో ఈ సినిమా ఉంటుంది. ‘ది రాజాసాబ్’ షూటింగ్లో మారుతీగారు బిజీలో ఉన్నా కూడా మా ‘బార్బరిక్’ మూవీ కోసం పనిచేశారు. మాకెన్నో ఇన్పుట్స్ ఇచ్చారు. సమకాలీన సంఘటనలకే మైథలాజికల్ టచ్ ఇచ్చి చేసిన సినిమాఇది. ఇందులోని ప్రతి పాత్రకూ భిన్న పార్శాలుంటాయి. సాంకేతికంగా అన్ని విధాలుగా సినిమా బావుంటుంది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది.’ అని నమ్మకం వెలిబుచ్చారు మోహన్ శ్రీవత్సా.