దర్శకుడు వి మధుసూధనరావు శతజయంతి ఉత్సవాలను హైదరాబాద్లో జూన్ 11న నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటారు. ఈ వివరాలను ఇటీవల హైదరాబాద్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో వెల్లడించారు. ఈ సందర్భంగా దర్శకుడు కోదండరామిరెడ్డి మాట్లాడుతూ…‘దర్శకుడు మధుసూదనరావు తెలుగు తెరపై ఎన్నో మరుపురాని చిత్రాలను రూపొందించారు.
ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు..ఇలా స్టార్ హీరోలందరికీ సూపర్ హిట్ చిత్రాలు అందించారు. ఆయన దగ్గర శిష్యుడిగా పనిచేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను’ అని అన్నారు. మధుసూదనరావు కుమార్తె శ్రీమతి వాణిదేవి మాట్లాడుతూ…‘నాన్న ప్రజానాట్య మండలిలో పనిచేశారు. ఆయనలో కమ్యూనిస్ట్ భావాలు ఉండేవి. ఎప్పుడూ ప్రజలతోనే ఉండాలని కోరుకున్నారు. నాన్న సినిమాల్లో పాటలు అర్థవంతంగా ఉండేవి. ఆయన శతజయంతి వేడుకలకు ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నాం’ అన్నారు.