బాలీవుడ్లో యథార్థ కథా చిత్రాలకు, వివాదాస్పద కథాంశాలకు పెట్టింది పేరు దర్శకుడు మధుర్ భండార్కర్. ఆయన డైరెక్ట్ చేసిన చాందినిబార్, పేజ్-3, ఫ్యాషన్, హీరోయిన్ వంటి చిత్రాలు బాలీవుడ్లో సంచలనం సృష్టించాయి. కథల ఎంపికలో వాస్తవికత, సహజత్వానికి ప్రాధాన్యతనిచ్చే మధుర్ భండార్కర్ మరోమారు వివాదాస్పదమైన సబ్జెక్ట్‌తో ఓ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు.
‘వైవ్స్ ఆఫ్ బాలీవుడ్’ పేరుతో బాలీవుడ్ సెలబ్రిటీల భార్యల తాలూకు జీవితాలను తెరపై ఆవిష్కరించబోతున్నారు. వినోదరంగంలో తెర వెనక నడిచే అనేక వ్యవహారాలను, స్కాండల్స్ను ఈ సినిమాలో చూపించబోతున్నామని, నిజ జీవిత సంఘటన స్ఫూర్తితో సబ్జెక్ట్‌కు సిద్ధం చేశానని మధుర్ భండార్కర్ తెలిపారు. సెలబ్రిటీల భార్యల చుట్టూ నడిచే ఈ కథలో అనేక ఆసక్తికరమైన విషయాలకు చర్చించబోతున్నామని నిర్మాత ప్రణవ్జైన్ తెలిపారు. జనవరిలో ఈ సినిమా సెట్స్‌మీదకు వెళ్తుందని, ప్రస్తుతం తారాగణం ఎంపిక జరుగుతున్నదని మేకర్స్ తెలిపారు.